బంగారు ఉంగరం అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బంగారు ఉంగరం అప్పగింత

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

మృతుడి ఆచూకీ లభ్యం పేకాటరాయుళ్ల అరెస్ట్‌ నలుగురు విద్యుత్‌ ఆపరేటర్ల తొలగింపు

మహానంది: మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు కోనేరులో పోగొట్టుకున్న బంగారు ఉంగరాన్ని దేవస్థానం సిబ్బంది వెతికి అప్పగించారు. బెస్తవారిపేటకు చెందిన నాగరాజు ఆదివారం మహానందికి వచ్చారు. కోనేరులో స్నానం ఆచరిస్తుండగా తన వేలికి ఉన్న మూడు గ్రాముల బంగారు ఉంగరం జారిపోయింది. దీంతో బయటికి వచ్చి గుర్తించిన భక్తుడు నాగరాజు స్థానిక హోంగార్డు నాయక్‌ దృష్టికి తీసుకురాగా శానిటేషన్‌ సిబ్బంది మేకల మూగన్న ద్వారా కోనేరులో వెతికించగా ఉంగరం దొరకడంతో ఆలయ సూపరింటెండెంట్‌ పి. సుబ్బారెడ్డి ద్వారా భక్తుడికి అందించారు.

పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

కర్నూలు సిటీ: పాలిసెట్‌కు ఎస్‌.జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఈనెల 4న ఉచిత శిక్షణ ప్రారంభమైంది. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ ఇవ్వనున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరై పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎంవిఎస్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. పూర్తి వివరాలకు 9492403015 నంబరును సంప్రదించవచ్చునని ఆయన పేర్కొన్నారు.

జాతీయ పోటీలకు కస్తూర్బా విద్యార్థిని

కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల వర్షిత జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ చైతన్యస్రవంతి ఆదివారం తెలిపారు. గతేడాది అక్టోబర్‌ 23న తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో జరిగిన అండర్‌–14 స్కూల్‌ గేమ్స్‌లో మొదటి స్థానాంలో రాణించగా జాతీయస్థాయికి ఎంపిక అయ్యారన్నారు. ఈ నెల 9 నుంచి భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో వర్షిత పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. గతంలో కూడా ఈ విద్యార్థిని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారన్నారు. విద్యార్థిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ సుప్రియను ఆమె అభినందించారు.

యువతి అదృశ్యం

కోవెలకుంట్ల: మండలంలోని భీమునిపాడుకు చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్‌ఐ అందించిన సమచారం మేరకు.. గ్రామానికి చెందిన యువతి ఉదయం స్నేహితుల వద్దకు వవెళ్లివస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద విచారించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మద్యం బాటిళ్ల స్వాధీనం

నంద్యాల(అర్బన్‌): మండలంలోని పెద్దకొట్టాల గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన నాగ హేమంత్‌కుమార్‌ బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం దాడి చేసి 26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

నంద్యాల(అర్బన్‌): నంద్యాల చిన్నచెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన సయ్యద్‌ జమాల్‌బాషా కొడుకులతో కలిసి చిన్న చెరువులో ఈతకు వెళ్లాడు. కొడుకులు కట్టపై వేరే ప్రాంతంలో ఉండగా జమాల్‌బాషా ఈత కొడుతూ చెరువులో మునిగిపోయాడు. కొద్ది సేపటికి కొడుకులు వచ్చి చూడగా తండ్రి కనిపించలేదు. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులను తీసుకొచ్చి గాలించగా రాత్రి శవమై కనిపించాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

శిరివెళ్ల: రాముల మాన్యం ప్రాంతంలో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో జరిపిన ఈ దాడిలో ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ. 1800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మధు సూదన్‌ తెలిపారు.

రుద్రవరం: మండలంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆపరేటర్లను ఉన్నతాధికారులు తొలగించినట్లు ఏఈ రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. ఎల్లావత్తుల సబ్‌స్టేషన్‌ నుంచి హరి, చిన్నకంబలూరు నుంచి పెద్దిరెడ్డి, ఆలమూరు నుంచి నరసింహనాయక్‌, హరినగరం సబ్‌బ్‌ స్టేషన్‌ నుంచి ఆంజనేయులు అనే నలుగురు ఆపరేటర్లను తొలగించినట్లు తెలిపారు. వారంతా నకిలీ ధ్రువ పత్రాలతో విధుల్లో చేరడంతో వేటు వేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement