● మూతపడుతున్న ఏటీఎంలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కొరత ఏర్పడింది. ఫలితంగా జిల్లాలో ఉన్న ఏటీఎంలు మూత పడుతున్నాయి. ఐదారేళ్లుగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. టీ తాగినా, పల్లీలు కొన్నా.... ఫోన్‌పేను వినియోగిస్తున్నారు. మొత్తం లావాదేవీల్లో 90 శాతం డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. నగదు సర్క్యులేషన్ గణనీయంగా పడిపోయింది. ఆర్‌బీఐ నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి నగదు రావడం లేదు. గతంలో వారానికి కనీసం ఒకసారి నగదు వచ్చేది. ప్రధానంగా ఆర్‌బీఐ నుంచి రూ.500 నోట్లు వచ్చేవి. ఆర్‌బీఐ నుంచి జిల్లాల్లోని కరెన్సీ చెస్ట్‌లకు నగదు సరఫరా దాదాపు నెల రోజులుగా లేకుండా పోయింది. గతంలో పెట్రోలు బంకులు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగేది. నేడు ఇందులో కూడా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. దీంతో నగదు సర్క్యులేషన్ తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు ఎంతమేర ఉన్నప్పటికీ చేతిలో అవసరాలకు కొంత నగదు ఉంచుకోవడం సర్వసాధారణం. చేతిలో రూ.1000, రూ.2000 ఉంచుకునేందుకు కూడా నగదు లభించడం లేదు. నగదు లేకపోవడంతో జిల్లాలోని ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఏటీఎంలో రూ.500 నోట్లు ఉంచే అవకాశం ఉంటుంది. అయితే ఈ నోట్లు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో ఏటీఎంలు మూత పడుతున్నాయి. బ్యాంకులు కొన్నింటిని సొంతంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చారు. నగదు లభ్యతను బట్టి బ్యాంకులు ఏటీఎంల్లో పెడుతున్నాయి. పలు బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు పడిపోవడంతో ఏటీఎంలను మూసేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేసే ఏటీఎంలు దాదాపు మూతపడ్డాయి. జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎంలు 153 ఉన్నాయి. ఇందులో బ్రాంచీల ఆధ్వర్యంలో 63, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 90 పనిచేస్తున్నాయి. వీటిలో 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 500కుపైగా ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో అత్యధిక ఏటీఎంలు పనిచేయడం లేదు. కలెక్టరేట్‌లోని ఎస్‌టీఐ ట్రెజరీ బ్యాంకు ఏటీఎం కొద్ది రోజులుగా మూత పడింది. దీంతో ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌బీఐ నుంచి నగదు ప్రధానంగా రూ.500 నోట్లు సరఫరా పెరిగితేనే ఏటీఎంలు తెరుచుకునే అవకాశం ఉంది.


