జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి

కర్నూలు(అర్బన్‌): డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ డా. ఏ సిరి పిలుపునిచ్చారు. ఆదివారం జగ్జీవన్‌రామ్‌ 119వ జయంతి వేడుకలను స్థానిక ఆర్‌ఎస్‌ రోడ్‌, ఐదు రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహం సమీపంలో ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బీ రాధిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా. ఏ సిరి మాట్లాడుతూ.. మనిషి అభివృద్ధికి పేదరికం అడ్డురాదని జగ్జీవన్‌రామ్‌ నిరూపించారన్నారు. అతి చిన్న వయస్సులోనే ఆయన పార్లమెంట్‌కు ఎన్నికయ్యారని, సుదీర్ఘకాలం కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలతో పాటు దేశ ఉప ప్రధాని పదవిని చేపట్టి ఆయా శాఖల్లో తనదైన ముద్రను వేశారన్నారు.

సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్‌ డా.ఏ సిరి చెప్పారు. 25 ప్రభుత్వ భవనాల్లో పలు రకాల మరమ్మతులకు రూ.7.80 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 వసతి గృహాలకు టాయ్‌లెట్స్‌, బాత్‌రూమ్స్‌కు రూ.1.69 కోట్లు, 14 వసతి గృహాలకు 351 మస్కిటో మెష్‌లను ఏర్పాటు చేసేందుకు రూ.9.50 లక్షలను మంజూరు చేశామన్నారు. అలాగే జిల్లాలోని పలు గ్రామాల్లో దళితులకు స్మశానవాటికల ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆర్‌డీఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమాధికారులు బీ మద్దిలేటి, కే బాబు, డీఎస్‌సీ మహబూబ్‌బాషా, డీవీఎంసీ నాయకులు మాలతి, సురేష్‌గౌడ్‌, ఎస్‌సీ, ఎస్‌టీ, ప్రజా సంఘాల నాయకులు గోన నాగరాజు, ఆర్‌ రాజ్‌కుమార్‌, అనంతరత్నం మాదిగ, ఆర్‌ కై లాస్‌నాయక్‌, యోగేష్‌నాయక్‌, రాగిరి చంద్రప్ప, కాసారపు వెంకటేష్‌, సోమసుందరం మాదిగ, నాగేశ్వరి, ఎన్‌సీహెచ్‌ బజారన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అలా వచ్చి.. ఇలా వెళ్లారు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సభాస్థలి వెనుకనున్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వెళ్లిపోయారు. సభ ఉదయం 10.30 గంటలైనా ప్రారంభించకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్‌బాబు అసహనంతో వెళ్లిపోయారు. వేదిక చాలా చిన్నదిగా ఏర్పాటు చేశారని కళాకారుడు విజయ్‌ ఆధ్వర్యంలో కళాకారులు వేదిక ముందు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దళిత నేతలంటే లెక్కలేని తనంగా అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement