కర్నూలు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిటిషనర్లకు ఇచ్చే ఎండార్స్‌మెంట్‌ను స్పష్టంగా ఇవ్వడం లేదని, అందువల్ల సంతృప్తి శాతం తగ్గుతోందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఒక సర్వేయర్ ఐదుగురు పిటిషనర్లకు సంబంధించి సర్వే చేసినప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వనందున అతని ఇంక్రిమెంట్లు కట్ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్‌ఖమర్, డీఆర్‌ఓ సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్జీదారులకు కలెక్టర్ ఫోన్
1100 కాల్ సెంటర్ ద్వారా అర్జీదారులతో జిల్లా కలెక్టర్ ఎ.సిరి స్వయంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి నందవరం మండలం షేక్‌రియాజ్‌బీ, ఎమ్మిగనూరు మండలం తార్నాద్, గోనెగండ్ల మండలం బోయ బుడ్డన్న, కల్లూరు మండలం లక్ష్మికాంతరెడ్డితో వారు పెట్టుకున్న అర్జీల వివరాలు తెలుసుకున్నారు. ఆయా అర్జీలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సంబంధిత తహసీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు.


