మార్కెట్‌లో కనిపించని మామిడి
2024లో ఎకరాకు సగటున 6–8 టన్నుల దిగుబడి వచ్చింది. 2025లో 2–3 టన్నుల వరకే దిగుబడి పరిమితమైంది. ఈ సారి మామిడిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నల్ల తామర విజృంభించింది. దీనికి తోడు తేనెమంచు పురుగులు చుట్టుముట్టి తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత, పిందే మొత్తం రాలిపోయింది.
మామిడిలో కనిపించని
పిందె, కాయలు
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెల వచ్చినా మార్కెట్‌లో మామిడి కనిపించని పరిస్థితి. మామూలుగా మార్చి రెండో వారం నుంచే మధుర ఫలం నోరూరిస్తుంది. మే నెల వరకు మామిడి మార్కెట్‌ను తనవైపు తిప్పుకుంటుంది. అలాంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మామిడి గల్లంతవడం రైతులతో పాటు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించే బేనిసా మామిడి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి. దీనినే బంగినపల్లి మామడిగా వ్యవహరిస్తారు. మొదటిసారి ఈ బేనిసా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకు 70 వరకు చెట్లు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉద్యాన శాఖ అధికారుల ప్రకారం ఎకరాకు సగటున 4 టన్నులు వస్తుంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 53వేలకు పైగా టన్నుల దిగుబడి రావాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక తోటల్లో ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల మామిడి కూడా లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్, జనవరి నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా పూత వచ్చింది. ఈ ఆనందం కొద్ది రోజులకే ఆవిరైపోయింది. వచ్చిన పూతలో 95 శాతంపైగా రాలిపోయింది. దాదాపు 10వేల ఎకరాల్లో అస్సలు పంట అనేది లేకుండా పోయింది. మిగిలిన తోటల్లో ఎకరాకు అర్ధ టన్ను వరకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.
లబోదిబోమంటున్న వ్యాపారులు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్, కల్లూరు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, తుగ్గలి, గూడూరు, దేవనకొండ, పత్తికొండ, సి.బెళగల్, హాలహర్వి, ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, అవుకు తదితర మండలాల్లో తోటలు ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే వ్యాపారులు తోటలను ఆ సీజన్ వరకు కొనుగోలు చేస్తారు. దిగుబడులు పెంచుకునేందుకు వ్యాపారులు చేయని ప్రయత్నం లేదు. నల్లతామర, తేనెమంచు పురుగుల నివారణకు విచ్చలవిడిగా పురుగుమందులు పిచికారీ చేశారు. పెట్టుబడి వ్యయం పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండాపోయింది. కాయలు లేక వెలవెలబోతున్న చెట్లను చూసి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మామిడి పూర్తిగా దెబ్బతినడానికి ప్రధాన కారణం నల్లతామర. నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది.
ఏప్రిల్ నెలలోనూ కనిపించని
మధుర ఫలం
ముంచిన నల్లతామర,
తేనేమంచు పురుగులు
దాదాపు 10 వేల ఎకరాల్లో
కనిపించని కాయలు
పంట లేక టన్ను ధర రూ.లక్షకు పైనే..
లబోదిబోమంటున్న వ్యాపారులు


