బేతంచెర్ల: స్థానిక చౌడేశ్వరీ దేవి తిరుణాల సందర్భంగా శేషారెడ్డి ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం పాలపండ్ల విభాగం ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, ఆలయ కమిటీ సభ్యులు గౌరి హుస్సేన్‌రెడ్డి, మల్లు సుబ్బారెడ్డి పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడు జతల వృషభాలు పాల్గొనగా.. పోటీలు ఉత్సాహంగా సాగాయి.
విజేతలు వీరే..
ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గోస్పాడు మండలం సాంబవరానికి చెందిన జూపల్లె ప్రభాకర్‌రెడ్డి ఎడ్లు నిలిచాయి. తృతీయ స్థానంలో డోన్ మండలం సీసంగంతల మదన్‌మోహన్‌రెడ్డి, నాలుగో స్థానంలో దువ్వూరు వీరన్న యాదవ్, డోన్ కృష్ణమోహన్‌ల ఎడ్లు సంయుక్తంగా నిలిచాయి. ఐదో స్థానంలో బేతంచెర్లకు చెందిన సయ్యద్ నూర్, ఆరో స్థానంలో ఉంగరానిగుండ్ల వెంకటేశ్వర్లు ఎడ్లు నిలిచాయి. విజేతలకు దాతల సహకారంతో రూ. 50 వేల నుంచి రూ. 5 వేల వరకు నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రఘురామిరెడ్డి, శేఖర్‌రెడ్డి, మద్దయ్య, రామస్వామి, అన్నారావు, నాగభూషణంరెడ్డి పాల్గొన్నారు.


