ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని కడివెళ్ల గ్రామంలో బిందెడు నీటికి ప్రజలు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటి అందించాలని ఎస్.నాగాలపురం గ్రామం నుంచి పైపులైన్లు వేసినా సక్రమంగా నీటిని సరఫరా చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులకొకసారి, కొన్నిసార్లు వారం అయినా నీటి సరఫరా జరగడం లేదని, దీంతో గుక్కెడు నీటికి నిత్యం యుద్ధం చేయాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు.
రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆల య క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
గ్యాస్ పంపిణీలో తిప్పలు
బనగానపల్లె: పట్టణంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారింది. భారత్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన 48 గంటల్లోపు డెలివరీ ఇవ్వాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా అతీగతి లేదని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డెలివరీ చార్జీల పేరుతో ఏజెన్సీ ప్రతినిధులు ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్నారు. ఐదు కిలోమీటర్ల లోపు ఉచితంగా అందించాల్సి ఉన్నా, దూరంతో సంబంధం లేకుండా రూ. 50 నుంచి రూ. 60 వరకు అదనంగా అడుగుతున్నారని సమాచారం.


