కౌతాళం: ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరుల సమావేశంలో సీఐ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. కుంటనహాల్ గ్రామంలో గత నెల 30వ తేదీన తెల్లవారు జామున నన్నేసాబ్ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం కుమారులే తండ్రిని చంపారని విచారణలో తేలింది. పరారీలో ఉన్న నన్నేసాహెబ్ పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, చిన్న కుమారుడు జునైద్, జునైద్ స్నేహితుడు రీహన్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆస్తిలో తమ వాటా ఇవ్వకుండా తండ్రి అలసత్వం వహిస్తున్నాడన్న అనుమానంతో మానసికంగా కుంగి నిందితులు తండ్రి హత్యకు పథకం పన్నారు. ఇందులో భాగంగానే ముగ్గరు కలిసి గత నెల 30వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న నన్నేసాబ్‌ను కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి చంపి అక్కడి నుంచి పారిపోయారు. మృతుడు నన్నేసాబ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుల్ని పట్టుకుని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, పీడిబాకు, సెల్‌ఫోన్‌ను స్వాదినం చేసుకుని నిందితుల్ని రిమాండుకు పంపినట్లు సీఐ తెలిపారు.
డోన్ టౌన్: స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తేనె తుట్టెను తొలగించే క్రమంలో అగ్నిమాపక సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ నెల 1వ తేదీ విద్యార్థినులపై తేనె టీగలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటిని తొలగించడానికి డోన్ అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం పాఠశాలకు వెళ్లారు. తేనె తుట్టెను తొలగించడానికి నీళ్లు కొట్టడంతో అవి ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశాయి. సిబ్బంది పరుగులు తీయాల్సి వచ్చింది. చివరకు ప్రత్యేక దుస్తులు ధరించి వాటర్ గన్‌ల సాయంతో తుట్టెను తొలగించారు. దీంతో విద్యార్థినులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డోన్ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామిగౌడ్, లీడింగ్ ఫైర్‌మన్ ప్రభాకర్, ఆపరేటర్ హరిప్రసాద్, ఫైర్‌మన్‌లు మహేశ్వరరెడ్డి, షహన్‌షా, రంగస్వామి పాల్గొన్నారు.


