ఎమ్మిగనూరురూరల్: పట్ణణంలోని కోసిగి రోడ్డులో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. భక్తులు ఉదయాన్నే పాత ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పురుషులు, మహిళలు, బాలికలు పెద్ద ఇనుప కడ్డీలను దవడకు గుచ్చుకొని భక్తిని చాటుకున్నారు. వీపున ఇనుప కొక్కీలను తగిలించుకుని తాడుకట్టి స్వామివారి రథాన్ని లాగారు. ఇలా చేయడం వల్ల కోర్కెలు తీరుతాయని, చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. రథోత్సవం ఆంజనేయస్వామి ఆలయం నుంచి షరాఫ్ బజార్, సోమేశ్వర, శ్రీనివాస సర్కిల్ మీదుగా కోసిగి రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. రథం ముందు భక్తులు నృత్యాలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా నీలకంఠప్ప, నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ధర్మకర్త యూజీ కేశవర్ధన్ చెప్పారు.
కలశాలతో వెళ్తున్న భక్తులు
దవడకు కడ్డీలు గుచ్చుకొని భక్తిభావం


