నందికొట్కూరు: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను విస్మరించడం తగదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మాధవస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. 11వ వేతన సవరణ కమిషన్ కాలపరిమితి పూర్తయి 32 నెలలు గడుస్తున్నా.. 12వ వేతన సవరణ కమిషన్ చైర్మన్‌ను నియమించకపోవడం మోసం చేయడమేనన్నారు. పెండింగ్‌లోఉన్న నాలుగు డీఏలను ప్రకటించాలని, 11వ పీఆర్సీ బకాయిలను, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్‌లీవ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కర్నూలు జిల్లా గౌరవవాధ్యక్షులు కమలాకర్‌రావు, జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి మరియానందం, నంద్యాల జిల్లా ఉపాధ్యాక్షులు శ్రీదేవి, సుంకన్న, కార్యదర్శి శ్రీరాములు, నాయకులు స్వామినాథం, రాఘవరెడ్డి, వెంకటరాముడు, మహబూబ్‌బాషా, అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


