సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

Apr 2 2026 7:23 AM | Updated on Apr 2 2026 7:23 AM

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహారదీక్ష

కర్నూలు(సెంట్రల్‌/సిటీ): ‘సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్రంగా మోసం చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం దిగి వచ్చేలా ఐక్య పోరాటాలకు సిద్ధం అవుతున్నాం’ అని యూటీ ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.లక్ష్మీరాజు అన్నారు. బుధవారం కర్నూలులోని ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీఆర్‌సీ, ఐఆర్‌, పెండింగ్‌ డీఏలు, ఇతర సమస్యల సాధన కోసం ఉపాధ్యాయులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు యూఆర్‌ఏ రవి కుమా ర్‌ అధ్యక్షతన చేపట్టిన దీక్షను రాష్ట్ర కార్యదర్శి కె.లక్ష్మీ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ దీక్షకు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ జిల్లా చైర్మన్‌ వి.జవహర్‌లాల్‌, హెడ్మాస్టర్‌ అసోసియేషన్‌ నాయకు లు నారాయణ, ఫ్యాప్టో నాయకులు సేవాలాల్‌ నాయక్‌ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గత పాలనను చూసి నమ్మి మోసపోయామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు. వెంటనే 12వ పీఆర్‌సీని వేయాలని, 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్‌ గాలికి వదిలివేశారని విమర్శించారు. ఈ నెల చివరలో అమరావతిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.నవీన్‌ పాటిల్‌, జిల్లా గౌరవాధ్యక్షుడు దావీదు, జిల్లా సహాధ్యక్షుడు హేమంత్‌కుమార్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి యెహోషువ, జిల్లా కార్యదర్శులు లక్ష్మీదేవి, ఇబ్రహీం, తిమ్మన్న, బాబ, సురేష్‌, రాష్ట్ర కౌన్సిలర్లు మల్లాది నాగరాజు, కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement