ఆస్పరి: వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలో కైరుప్పల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్రస్వామి, కాళికాదేవిల కల్యాణ మహోత్సవం నిర్వహించునున్నట్లు ఆలయ ఈఓ రాంప్రసాద్ శనివారం తెలిపారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, ఈ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.
వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ( ఈ నెల 31వ తేదీ) ముగిసే నాటికి వంద శాతం పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు అరియర్స్ కలుపుకొని మొత్తం రూ.19.01 కోట్లను వసూలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 3,59,800 అసెస్‌మెంట్స్‌కు ఇప్పటి వరకు 3,14,493 అసెస్‌మెంట్స్‌ను కలిసి రూ.15.78 కోట్లను ( 83.02 శాతం) వసూలు చేశారన్నారు. మిగిలిన రూ. 3.22 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉందన్నారు. పన్ను వసూలుకు క్షేత్ర స్థాయిలోని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఈ వారం రోజులు కష్టపడాలన్నారు. గూడూరు మండలంలో వంద శాతం వసూలు కాగా.. నందవరం, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోడుమూరు, ఓర్వకల్, సి.బెళగల్, చిప్పగిరి, తుగ్గలి మండలాలు 90 శాతం దాటాయన్నారు. మిగిలిన మండలాలు కూడా దాదాపు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని, అందరూ లక్ష్యాన్ని సాధించాలన్నారు.
మద్యం మత్తులో చెరువులోకి దిగి..
● కంబాలపాడు చెరువులో మునిగి డోన్ వాసి మృతి
కృష్ణగిరి: అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి సమీపంలోని చెరువులోకి ఈతకు దిగి మృత్యుఒడిలోకి చేరిన ఘటన మండలంలోని కంబాలపాడు గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ పట్టణంలోని చిగురుమాను పేటకు చెందిన ఎరుకల రాజేష్ (25) శనివారం ఉదయం మద్యం సేవించి తమ ఇంటి దైవమైన కంబాలపాడు చెరువు కట్టపై ఉన్న గంగమ్మకు మొక్కు తీర్చుకునేందుకు కోడిపుంజుతో స్నేహితులు ఎరుకల సతీష్, ఎరుకల మల్లికార్జున, ఎరుకల ఆశోక్‌తోపాటు మరికొందరితో ఆలయం చేరుకున్నాడు. అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించి వంట చేసుకుంటున్న సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. మద్యం మత్తులో ఉన్న రాజేష్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు గాలించి బయటకు తీసుకొచ్చి డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కాగా..మృతుడికి భార్య ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.


