పూర్తి‘స్థాయీ’లో నీరివ్వాలి | - | Sakshi
Sakshi News home page

పూర్తి‘స్థాయీ’లో నీరివ్వాలి

Jan 22 2026 7:02 AM | Updated on Jan 22 2026 7:02 AM

పూర్త

పూర్తి‘స్థాయీ’లో నీరివ్వాలి

అధికారులూ.. అవాస్తవాలు చెప్పొద్దు

కాలువల పనులు మే నాటికి పూర్తి చేయాలి

జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి

2026–27కు రూ.724.114 కోట్లతో అంచనా బడ్జెట్‌కు ఆమోదం

ఎన్‌టీఆర్‌ వైద్య సేవలో అక్రమాల జోరు: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు(అర్బన్‌): రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉందని, రబీ పంటలకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కెనాల్‌ కింద 68 చెరువులను నింపామని ఇరిగేషన్‌ అధికారులు చెప్పటాన్ని జెడ్పీ చైర్మన్‌ తప్పుబట్టారు. జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను బుధవారం నిర్వహించారు. ఏడో స్థాయీ సంఘ సమావేశంలో నీటి పారుదల శాఖపై జరిగిన సమీక్షలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కింద ఎన్ని చెరువులను నింపారని జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి ప్రశ్నించారు. మొత్తం 77 చెరువుల్లో 68 చెరువులను నింపామని ఇరిగేషన్‌ అధికారులు చెప్పారు. వెంటనే దేవనకొండ జెడ్పీటీసీ రామక్రిష్ణ మాట్లాడుతూ తన మండలంలోని నల్లచెలిమిల వద్ద ఉన్న రెండు చెరువులకు నేటికి ఒక్క చుక్క నీరు రాలేదని చెప్పారు. దీంతో జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి జోక్యం చేసుకుంటు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అధికారులు ప్రయత్నించాలే తప్ప అవాస్తవాలను చెప్పరాదని హితవు పలికారు.

‘అవుకు’ పనులు త్వరితగతిన

పూర్తి చేయాలి

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్‌ –1, 2, గోరుకల్లు రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉందని, ప్రస్తుత రబీ సీజన్‌లో పూర్తి స్థాయిలో సాగు నీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్‌ సూచించారు. అవుకు రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేసుకునేందుకు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మార్చి 31వ తేదీ వరకు ఆయా కెనాల్స్‌ ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. టీబీ డ్యాం గేట్ల పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 10 నుంచి ఎల్‌ఎల్‌సీకి నీటిని నిలిపి వేశారని, వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్‌ నెలలో ఎల్‌ఎల్‌సీకి నీటిని విడుదల చేస్తారని సంబంధిత ఇంజినీరు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుడూ అన్ని కాలువల్లో మార్చి 31వ తేదీ వరకు నీరు విడుదలవుతున్న నేపథ్యంలో వివిధ రకాల అభివృద్ధి పనులను మే నెల నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

రూ. 724.114 కోట్ల అంచనా

బడ్జెట్‌కు ఆమోదం

2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా పరిషత్‌, వివిధ అనుబంధ శాఖలపై రూపొందించిన రూ.724.114 కోట్ల అంచనా బడ్జెట్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో వ్యయాన్ని రూ.718.773 కోట్లుగా చూపించారు. కేవలం జిల్లా పరిషత్‌కు సంబంధించి 2026–27కు అంచనా బడ్జెట్‌ను రూ.15.78 కోట్లుగా ప్రతిపాదించారు. స్టాంప్‌ డ్యూటీ కింద 2026–27లో రూ.8,18,87,820, తలసరి గ్రాంట్‌ రూ.4 ప్రకారం రూ.1,15,42,160లు, గనుల శిస్తు కింద రూ.6,22,20,542, జిల్లా పరిషత్‌కు క్వార్టర్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, ఇతర భవనాల కింద రాబడులను రూ.22,02,300 వస్తాయని అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఆయా స్టాండింగ్‌ కమిటీల చైర్‌పర్సన్లు కురువ బుజ్జమ్మ, పీ దివ్యతో పాటు పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, విద్య, వైద్యం తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.

అందని పంట నష్ట పరిహారం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత రెండేళ్లుగా వివిధ కారణాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం నేటికీ అందలేదని జెడ్పీటీసీ సభ్యులు సుధాకర్‌రెడ్డి, సుంకన్న, మహేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఆర్థికనష్టాన్ని చవి చూశారన్నారు. ఒక క్వింటానికి రైతులు రూ.800 వరకు నష్టపోయారన్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యూరియా కూడా అవసరాల మేరకు రైతులకు అందడం లేదని వాపోయారు.

ఎన్‌టీఆర్‌ వైద్య సేవలో అక్రమాల జోరు

జిల్లాలోని మెజారిటీ ప్రైవేటు అసుపత్రులు ఎన్‌టీఆర్‌ వైద్య సేవను అడ్డుపెట్టుకొని పేద రోగుల నుంచి ముక్కుపిండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కర్నూలు నగరంలోని పలు హాస్పిటల్స్‌ రోగులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే రోగి వెంట వచ్చిన వారి నుంచి తాము ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఎన్‌టీఆర్‌ వైద్య సేవ ద్వారా ప్రభుత్వం జిల్లాకు రూ.25 కోట్లను విడుదల చేసిందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రైవేటు అసుపత్రులు గండి కొడుతున్నాయన్నారు. ఈ సందర్‌భంగా వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్‌ ఎం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే కాల్‌ సెంటర్‌ నంబర్‌: 1800 4254299కు కాల్‌ చేయాలని ప్రతి హాస్పిటల్‌లో మూడు చోట్ల ఫ్లెక్సీలు పెట్టామన్నారు. అక్రమ వసూళ్లకు సంబంధించి ప్రతి నెలా ఎన్ని ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దాదాపు 40 నుంచి 45 కాల్స్‌ వస్తున్నాయని, వీటిని విచారిస్తే దాదాపు 15 నుంచి 20 కాల్స్‌ వాస్తవని రుజువు అవుతున్నాయని భాస్కర్‌రెడ్డి సమాధానమిచ్చారు. కర్నూలు నగరంలోని పలు హాస్పిటల్స్‌కు జరిమానాలు విధించామన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో అవినీతి అక్రమాలు పెరిగిపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందన్నారు.

పూర్తి‘స్థాయీ’లో నీరివ్వాలి 1
1/1

పూర్తి‘స్థాయీ’లో నీరివ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement