రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
ఆదోని రూరల్: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. బుధవారం ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ ఆదోని డివిజన్ రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తక్షణ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆదోని డివిజన్‌లో ఇనాం నుంచి పట్టా భూములకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని డ్రైవ్ మోడ్‌లో పరిష్కరించాలన్నారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల కారణంగా రైతులు తమ పిల్లల విద్య, వివాహ అవసరాలకు విక్రయించుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను సుమోటోగా పరిష్కరించాలన్నారు. భూ సమస్యలకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించే ముందు రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయాలన్నారు. వారి సమక్షంలోనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 24న గ్రామసభలు నిర్వహించాలని, వివరాలను ముందుగానే రైతులకు తెలియజేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి రెండుసార్లు ఈ–కేవైసీ తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్వో వెంకటనారాయణమ్మ, ఆదోని ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


