రేబిస్‌తో యువకుడు మృతి
కర్నూలు(హాస్పిటల్): కుక్కకాటుతో రేబిస్ బారినపడి ఓ యువకుడు మృతి చెందిన ఘ టన నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం జమ్ములదిన్నె గ్రామానికి చెందిన టి.హరిగోపాల్(25) మూడు నెలల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. కుక్క కరిచినా అతను వ్యాక్సిన్ వేసుకోకపోవడంతో ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. కుటుంబసభ్యులు ఈ నెల 19న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. ఆసుపత్రిలోని అంటువ్యాధుల విభాగంలో చికిత్స పొందుతున్న అతను బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పారదర్శకంగా ఉపాధి పనులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఉపాధి పనులు పారదర్శకంగా చేపట్టేందుకు కృషి చేస్తామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలత తెలిపారు. అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈమెకు జిల్లా కలెక్టర్ పీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పీడీగా పని చేస్తున్న వెంకటరమణయ్య ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. బుధవారం బాధ్యతలు స్వీకరించిన మధవీలత విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరింత జవాబుదారీతనంతో పనిచేస్తూ ఆడిగిన వారందరికీ పనులు కల్పించాలన్నారు.
మల్టీపర్పస్ గోదాములతో ఆదాయం
కర్నూలు(అగ్రికల్చర్):జిల్లాలో నిర్మించిన మల్టీపర్పస్ గోదాములను సద్వినియోగం చేసుకొని ఆదాయం పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కో–ఆపరేటివ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ శ్యామ్‌కుమార్ తెలిపారు. గోదాములను శాసీ్త్రయంగా వినియోగించుకోవడం ఎలా అనే అంశంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సహకార సంఘాల సీఈఓల కు నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్టీపర్పస్ గోదాములు సహకార సంఘాలకు ఆస్తులని, వీటిని చక్కగా వినియోగించుకుంటే సంఘాలను లాభాల బాట పట్టించవచ్చన్నారు. రైతులు పండించిన వివిధ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. గోదాముల్లో నిల్వ చేసిన ఉత్పత్తుల నాణ్యత దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత సంఘాల సీఈఓలదేనని, శాసీ్త్రయ పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్, జిల్లా సహకార ఆడిట్ అధికారి చెన్నమ్మ పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్–2026 మొదటి విడత పరీక్ష లు బుధవారం ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం పరీక్ష సమయానికి గంటముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించా రు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈ నెల 29వ తేది వరకు జరుగనున్నాయి. పరీక్షలకు కె.వి సుబ్బా రెడ్డి కాలేజీలోని ఆయాన్ డిజిటల్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ పరీక్షకు 254 మంది విద్యార్థులు హాజరయ్యారు.
851 మంది విద్యార్థులు గైర్హాజరు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన కాలేజీల్లో నైతికత, మానవ విలువలు అనే పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 26,465 మంది విద్యార్థుల్లో 25,614 మంది పరీక్షలకు హాజరుకాగా, 851 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు.ఈ నెల 23న నిర్వహించనున్న పర్యావరణ విద్య పరీక్షకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.
రేబిస్‌తో యువకుడు మృతి


