నమో.. నారసింహా
ఆళ్లగడ్డ: పార్వేట ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్సవమూర్తులు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి యాదవాడ గ్రామంలో కొలువు దీరారు. గ్రామ పొలిమేర తెలుపుపై కొలువైన ఉత్సవమూర్తులకు గ్రామ ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు భుజాలపై పల్లకీని మోసుకుంటూ తెలుపులపై కొలువుంచారు. పారువేట ఉత్సవాల్లో భాగంగా 16వ తేదీన కొండదిగిన ఉత్సవ పల్లకి ఆళ్లగడ్డ మండలం పూర్తి చేసుకుని బుధవారం రాత్రికి రుద్రవరం మండలంలోకి ప్రవేశించింది. ఆలమూరు గ్రామంలో తెలుపుపై ఉత్సవ పల్లకీని కొలువుంచి స్వామిని ప్రజలు దర్శించుకున్నారు.
పెళ్లి పేరుతో మోసం
ఆత్మకూరురూరల్: తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు .. ఏబీఎం పాలేనికి చెందిన యువతిని స్వరాజ్ నగర్‌కు చెందిన యువకుడు దారా రాజ్ కుమార్ ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటాని వాగ్దానం చేయడంతో కుటుంబ సభ్యులతో యువతి తల్లిదండ్రులు మాట్లాడారు. వారు వివాహానికి నిరాకరించడంతో తమకు న్యాయం చేయాలని బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. రెండు కుటుంబాల వారు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు.


