రైతులకు పరిహారం చెల్లించాలి
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె, శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్–బేవరేజెస్ క్యాంప కో లా కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహా రం వెంటనే చెల్లించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అలాగే భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలన్నారు. కాల్వ, హుస్సేనాపురం ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్లు వేయడం అన్యాయమని, ముందు వారికి పరిహారం చెల్లించాలని కోరారు.
పీజీఆర్‌ఎస్ అర్జీలను త్వరగా పరిష్కరించండి
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువులోపు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా బాధితులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. కాగా, సోమవారం మొత్తం 270 అర్జీలు రాగా, అందులో రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 167 ఉండగా..మిగిలిన అర్జీలను శాఖల వారీగా విభజించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసినట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. కార్యక్రమంలో జేసీ నూరుల్లా ఖమర్, హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు.


