ఏర్పాట్లు పూర్తయ్యేదెన్నడు!
కొత్తపల్లి: వసంత పంచమికి మూడురోజులే వ్యవధి ఉన్నా కొలనుభారతి క్షేత్రంలో ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈనెల 23వ తేదీ సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీశైలం దేవస్థానం కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్న వేడుకలు కావడంతో భక్తులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఘనమైన ఏర్పాట్లు చేస్తారని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సప్త శివాలయాల చుట్టూ ఉన్న బేస్ మట్టానికి సున్నం, సర్పంచు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత పనులు తప్పా ఎటువంటి పనులు ప్రారంభించలేదు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. క్యూలైన్లు, తాగునీటి ప్లాంట్, రహదారి మరమ్మతులు, పార్కింగ్ ఏర్పాట్లు, చారుఘోషిని నది కొలను శుభ్రత చేపట్టలేదు. మూడు రోజులే వ్యవధి ఉండటంతో ఏర్పాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైల దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.


