దూసుకొచ్చిన మృత్యువు
● నిలిచిన లారీని ఢీకొన్న బొలెరో ● అదుపు తప్పి డివైడర్ ఆవల వైపు కారు పైకి దూసుకొచ్చిన వైనం ● కారులో ఉన్న తల్లీ, కుమార్తె మృతి ● గాయాలతో బయటపడిన తండ్రి, కుమారుడు
ఎమ్మిగనూరురూరల్: తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బనవాసి గ్రామానికి చెందిన తల్లీ, కుమార్తె మృతి చెందారు. మండల పరిధిలోని బనవాసి గ్రామానికి చెందిన సర్పంచ్ లక్ష్మీదేవి, నల్లారెడ్డి దంపతుల కుమారుడు బసిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇతనికి భార్య రాధ(42), కుమార్తె లక్ష్మీదుర్గ(8), కుమారుడు ఠాగూర్‌రెడ్డి ఉన్నారు. బసిరెడ్డి కుమార్తెకు పుట్టినప్పుటి నుంచి ఆరోగ్యం బాగలేకపోవటంతో చికిత్స చేయిస్తున్నారు. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ వైద్యం అందిస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం బనవాసికి వచ్చిన వీరి చికిత్స నిమిత్తం సోమవారం మధ్యాహ్నం కారులో హైదరాబాద్‌కు భార్య, పిల్లలతో బసిరెడ్డి బయలుదేరాడు. మార్గమధ్యలో జానంపేట సమీపంలో నిలిచి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదరుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న రాధ (42), వెనక సీటులో లక్ష్మీదుర్గ(8) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్‌లో ఉన్న బసిరెడ్డి, కుమారుడు ఠాగూర్‌రెడ్డి గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తల్లీబిడ్డలో మృతి చెందారనే విషయం తెలియటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


