గురుశిష్యుల బంధానికి ప్రతీక
● 25న బొమ్మిరెడ్డిపల్లె పామయ్య తాత తిరుణాల
వెల్దుర్తి: గురుశిష్యుల బంధానికి, రెండు గ్రామాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధానికి పామయ్య తిరుణాల ప్రతీకగా నిలుస్తోంది. అవధూత లద్దగిరి పెద్దరాందాసు అంశగా పిలిచే బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన పామయ్య తాత వర్ధంతి ఈనెల 25న ఆదివారం (తెలుగు సంవత్సరం మాఘమాసం తొలి ఆదివారం) సందర్భంగా ఏటా అదే రోజున తిరుణాల జరుపుకుంటున్నారు. మండల పరిధిలోని నార్లాపురం గ్రామం పెనికలపాటి వంశీయులు ఎడ్లబండ్ల ద్వారా తీసుకువచ్చే తొలి నైవేద్యంతో, తాత వారసులైన బొమ్మిరెడ్డిపల్లె వాసులు అర్చకులై చేసే పూజలతో తిరుణాల ప్రారంభమవుతుంది. పూర్వం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన గొల్ల పామయ్య, నార్లాపురం రైతు పెనికలపాటి హనుమంతయ్య గొర్రెల కాపర్లుగా కొండలు, గుట్టల వెంబడి సంచరించేవారు. అయితే పామయ్య తన మహిమలతో అద్భుతాలు సృష్టిస్తుండటంతో హనుమంతయ్య శిష్యుడిగా మారి అతని సేవలో తరించాడు. పామయ్య తాత పరమదించగా బొమ్మిరెడ్డిపల్లె సమీపంలో సమాధి చేశారు. గ్రామస్తులు ఆలయాన్ని నిర్మిస్తుండగా నాటి బ్రిటీష్ కలెక్టర్ అడ్డుపడి అనారోగ్యం పాలై తాత మహిమలు గుర్తించి, తిరిగి ఆలయ నిర్మాణానికి సహకరించినట్లు గ్రామస్తులు చెబుతారు. 1930లో శిష్యుడు హనుమంతయ్య పరమపదించగా పామయ్య గుడి పక్కనే శిష్యున్ని సమాధి చేశారు. పామయ్య తాత గుడి నిర్వహణకు శిష్యుడు హనుమంతయ్య వంశీయులు సొంత పొలం రెండెకరాలు కేటాయించి, హనుమంతయ్యకు సైతం గుడి నిర్మించారు. పామయ్య తాత తిరుణాల నాడు పక్కపక్కనే ఉన్న గురుశిష్యుల సమాధుల వద్ద భక్తులు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. శిష్యుడైన పెనికలపాటి హనుమంతయ్య పద్ధతి మేరకు ఆయన వంశీయులు ఇప్పటికీ ఆనవాయితీగా తిరుణాల రోజు ఎద్దులబండ్లపై తొలినైవేద్యం బొమ్మిరెడ్డిపల్లె పామయ్యతాత సమాధి వద్ద సమర్పిస్తూ వస్తున్నారు.
మూడు రోజుల వేడుకలు
పామయ్య తిరుణాల పురస్కరించుకుని వర్ధంతి నాడు ఈనెల 25న ఆదివారం ప్రత్యేక పూజలు, రాత్రి చెక్కభజన, నందికోలసేవ అనంతరం పంచమాంకములు డ్రామా నిర్వహిస్తున్నారు. 26వ తేదీ సోమవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇరు గ్రామాల ప్రజలు, వారి బంధువులు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు గురుశిష్యుల ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తిరుణాలలో భాగంగా 26న రాష్ట్రస్థాయి వృషభాల బండలాగుడు పోటీలు, 27న గిరక బండి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల వివరాలకు 8328252686, 9398809593ను సంప్రదించాలన్నారు.


