పోలీసుల ‘పచ్చ’పాతం!
● వైఎస్సార్‌సీపీ వర్గీయుడిని చితకబాదిన టీడీపీ మద్దతుదారులు ● విచారణ చేయకుండానే బాధితుడిపైనే పోలీసుల కేసు నమోదు
బండిఆత్మకూరు: బాధితుల పక్షాన నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి దాసోహమవుతున్నారు. టీడీపీ నేతలు, మద్దతుదారులు చెప్పిందే వేదంలా భావిస్తూ జీ హూజూర్ అంటున్నారు. ఇందుకు బండిఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం. ఆదివారం సాయంత్రం టీడీపీ మద్దతుదారుల చేతిలో దాడికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం పొలం వద్ద పూడ్చిన సాగునీటి కాలువ విషయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారుడు దాసరి నడిపెన్న స్థానిక పోలీస్ స్టేషన్‌లో నాగరాజుపై ఆదివారం ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక ఎస్‌ఐ జగన్‌మోహన్ పిలుపుతో నాగరాజు స్టేషన్‌కు వెళ్లి సమస్యను వివరించాడు. అయితే టీడీపీ మద్దతుదారులకు అనుకూలంగా నడుచుకోవాలని సూచించడంతో అందుకు ఒప్పుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో గ్రామంలోని ఫిల్టర్ వాటర్ ప్లాంట్ వద్దకు రాగానే దాసరి నడిపెన్న, చిన్న మల్లికార్జున, యువరాజు, దాసరి వంశీ.. నాగరాజు బైక్ ఆపి కేకలు వేస్తూ తిట్ల దండకం అందుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా నాగరాజుపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకుని తీవ్ర గాయాలపాలైన నాగరాజును నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నాగరాజుపై దాడికి పాల్పడిన టీడీపీ మద్దతుదారులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్‌ఐ జగన్‌మోహన్ విచారణ చేపట్టకుండానే వైఎస్సార్‌సీపీ వర్గీయుడిపై కేసు నమోదు చేయడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాస్తవాలను పక్కనపెట్టి టీడీపీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగరాజుపై సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై ఎస్‌ఐను వివరణగా కోరగా.. నాగరాజు తప్పిదం ఉండటతో కేసు నమోదు చేశామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజును సోమవారం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బారెడ్డి విజయభాస్కర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు పక్షపాత వైఖరిని వీడి బాధితులకు న్యాయం చేయాలని హితవు పలికారు.


