హెచ్‌ఐవీ బాధితులు అధైర్యపడవద్దు
కర్నూలు(హాస్పిటల్): హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడకుండా ఏఆర్‌టి మందులు సక్రమంగా వాడి జీవితకాలం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆద్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7వేల మంది హెచ్‌ఐవితో బాధపడుతూ ఏఆర్‌టి మందులు వాడుతున్నారని తెలిపారు. బాధితుల పట్ల సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ మానవీయతతో వ్యవహరించాలన్నారు. హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్న వారు కచ్చితంగా టెస్ట్‌లు చేయించుకోవలని, ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే వెంటనే చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్, డీసీహెచ్‌ఎస్ జఫ్రుల్లా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


