నిరాశ పరిచిన మంత్రి బీసీ
● రాయల్టీ సమస్య వెంటనే పరిష్కారం కాదంటూ తేల్చిన మంత్రి ● ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ దాట వేసిన వైనం
కొలిమిగుండ్ల: మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తే వెంటనే సమస్య పరిష్కారమవుతుందని ఆశించిన మైనింగ్ యజమానులు, ట్రాక్టర్ల నిర్వాహకులు, కార్మికులకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే పరిశ్రమ స్తంభించి కార్మికులు ఉపాధి కోల్పోయిన రోడ్డున పడ్డారు. రోజులు గడిచేకొద్ది కుటుంబాల పోషణ భారంగా మారుతోంది. ఈ క్రమంలో మైనింగ్ రాయల్టీలు ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో ఉత్పన్నమైన సమస్యల గురించి నాపరాతి గనుల యజమానులు మంత్రి బీసీ జనార్దనరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం బెలుం గుహల ఆవరణలో ఏర్పాటు చేసిన మైనింగ్, పాలీష్ ఫ్యాక్టరీలు, ట్రాక్టర్ యజమానులు, కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాయల్టీ ప్రవేట్ పరం చేయడంతో ఎదురవుతున్న కష్ట, నష్టాల గురించి పలువురు యజమానులు మంత్రికి వివరించి వినతి పత్రం అందజేశారు. పాత పద్ధతిలోనే రాయల్టీ విధానం ఉండేలా చేస్తేనే పరిశ్రమ మనుగడ సాధిస్తుందన్నారు. ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని అన్ని జిల్లాల్లో వివిధ రకాల మినరల్స్‌కు ఇదే పద్ధతి అమల్లో ఉందని మంత్రి బీసీ పేర్కొన్నారు. ఈ సమస్య ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారం కాదని, పది రోజుల్లో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని సమావేశానికి వచ్చిన యజమానులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.


