
అదుపు తప్పి లారీ బోల్తా
తుగ్గలి: గిరిగెట్ల సమీపంలోని లింగాల వంక బ్రిడ్జిపై నుంచి శనివారం అదుపుతప్పి లారీ కిందపడి పోయింది. గుత్తి నుంచి పత్తికొండ వైపు హిటాచీ యంత్రాన్ని తీసుకెళ్తున్న లారీ మార్గమధ్యలో లింగాల వంక వంతెన దాటగానే అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం రద్దీకి ఇరుకుగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే పత్తికొండ–బెంగళూరు రోడ్డును విస్తరించడంతో పాటు బ్రిడ్జిని వెడుల్పు చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
ఊళ్లు ఖాళీ అవుతున్నాయ్!
గోనెగండ్ల: పల్లెలు వల స బాట పడుతున్నాయి. ఊర్లకు ఊళ్లు పనులు వెత్కుంటూ కదులుతున్నాయి. సొంతూరులో ఉపాధి లేకపోవడంతో తెలంగాణ, గుంటూరు ప్రాంతాలకు వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు వలస వెళ్తున్నారు. శనివారం మండల కేంద్రం గోనెగండ్లతో పాటు గంజిహళ్లి, కులుమాల, అగ్రహారం తదితర గ్రామాల నుంచి కూలీలు పొట్ట చేత పట్టుకొని వలస బాట పడుతున్నారు. ఆయా గ్రామాలకు చెందిన కూలీలు శుక్ర, శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్, తదితర పట్టణాలకు వలస వెళ్లారు. గోనెగండ్ల ఎస్సీ కాలనీలో రాత్రి 50 కుటుంబాలు వలస బాట పట్టాయి. ఈ ఏడాది సాగుచేసిన పంటలు నష్టపోవడం, ప్రస్తుతం గ్రామాల్లో పనులు లేకపోవడం, అధికారులు పనులు చూపకపోవడంతో వలసలు వెలుతున్నట్లు కూలీలు చెబుతున్నారు. డిసెంబర్ వరకు పనులు చేసుకొని మళ్లీ తిరిగి సొంత గ్రామాలకు వస్తామంటున్నారు.
పొలంలో పత్తి చోరీ
గోనెగండ్ల: కున్నూరు గ్రామంలో ఓ రైతు పొలంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పత్తిని అపహరించారు. గ్రామానికి చెందిన రైతు సుబ్బరాయుడు 10 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రతి రోజున తీసిన పత్తి పంటను పొలంలో వేసిన షెడ్‌లో నిల్వ చేసేవాడు. తీసిన పత్తి పంట అంత ఒకేసారి అమ్మితే బాగుంటుందని భావించి పొలంలోనే తీసిన పత్తిని యూరియా సంచులలో నింపి పొలంలోనే ఉంచాడు. షెడ్‌లో దాదాపు 60 క్వింటాళ్ల వరకు నిల్వ ఉంచాడు. గుర్తించిన దుండగులు పథకం ప్రకారం శుక్రవారం రాత్రి వంద యూరియా బస్తాల్లో దాదాపు 30 క్వింటాళ్ల మేర అపహరించారు. శనివారం ఉదయం రైతు పొలానికెళ్లి చూడగా పత్తి పంటను దొంగలించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు పొలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

అదుపు తప్పి లారీ బోల్తా

అదుపు తప్పి లారీ బోల్తా