
బ్యాగ్ అప్పగింత
● ఆటోలో మరిచిపోయిన ప్రయాణికులు ● అందులో 9 తులాల బంగారు
నంద్యాల: పట్టణంలోని నడిగడ్డకు చెందిన షేక్ రహిమాన్ ఈనెల 17న ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను నంద్యాల వన్‌టౌన్ పోలీసులు బాధితుడికి శనివారం అప్పగించారు. వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన మేరకు.. షేక్ రహిమాన్ కుటుంబంతో కలిసి కోవెలకుంట్ల వెళ్లడానికి నడిగడ్డలో ఆటో ఎక్కి ఆర్టీసీ బస్టాండ్ వద్ద దిగారు. దిగే సమయంలో ఆటోలో తన భార్యకు చెందిన హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయారు. అందులో 8 తులాల బంగారు నెక్లెస్, ఒక తులం మాట్నీలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైం టీం సభ్యులతో కలిసి బస్టాండ్‌లోని సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కెమెరాలను పరిశీలించి ఆటోను గుర్తించారు. కాగా..విశ్వనగర్‌కు చెందిన మాబుహుసేన్ తన ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌తో బాధితుల కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో బ్యాగ్‌ను పోలీసులకు ఇవ్వాలనుకున్న సమయంలో పోలీసులు వెళ్లి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు.