
నవంబర్‌లో గుండ్రేవుల కోసం జలదీక్ష
కర్నూలు(సెంట్రల్): వెనుకబడిన కర్నూలు జిల్లా స్థితిగతిని మార్చే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం నవంబర్ మూడో వారంలో జలదీక్ష చేపట్టాలని మేధావులు, రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. శనివారం బిర్లా కంపౌండ్‌లోని కేపీఎస్ కార్యాలయంలో ‘కర్నూలుకు తాగునీరు– రైతులకు సాగునీరు’ నినాదంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతపై కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేపీఎస్ అధ్యక్షుడు శ్రీ హర్ష అధ్యక్షత వహించగా మేధావులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ చెన్నయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్, విద్యావేత్త జి.పుల్లయ్య, రైతు సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, శేషన్నరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు రవికుమార్, లోక్‌సత్తా నాయకుడు డేవిడ్, వీహెచ్‌పీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, సీపీఎం నాయకులు పుల్లారెడ్డి, ఇతర నాయకులు హరినాథ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా గుండ్రేవుల ప్రాజెక్టుకు 20 టీఎంసీలతో డీపీఆర్ రూపొందించిన సుబ్బారాయు డు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేపీఎస్ అధ్యక్షుడు శ్రీహర్ష మాట్లాడుతూ.. గుండ్రేవుల ప్రాజెక్టు చేపడితే కర్నూలుకు తాగునీటితోపాటు పశ్చిమ ప్రాంతంలోని పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంపూర్ణంగా సాగునీరు అంది రైతులు బాగుపడతారన్నారు. 40 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పాలకులు కుంటిసాకులు చెబుతూ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఎన్నికల కోసం శంకుస్థాపన చేసిన చంద్రబాబునాయుడు..ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మా ణం కోసం ప్రజల మద్దతు పోరాటాలు చేయడంలో భాగంగా నవంబర్ మూడో వారంలో జలదీక్ష చేపట్టనున్నట్లు వివరించారు.