
క్లాప్ మిత్రల సంక్షేమంపై దృష్టి సారించండి
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపడుతున్న క్లాప్ మిత్రల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో జిల్లాలోని ఎంపీడీఓలకు ఎల్‌ఎస్‌డీజీఎస్ థీమ్ – 5 ( క్లీన్ అండ్ గ్రీన్ ) అనే అంశంపై టీఓటీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అర్హులైన క్లాప్ మిత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా భద్రత, సంక్షేమ పథకాలు, పీఎంఎస్‌బీవై, చంద్రన్న బీమా, ఈ శ్రమ్, ఎన్‌టీఆర్ భరోసా అందేలా చూడాలన్నారు. ప్లాస్టిక్ అధిక వినియోగంతో మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయాల దిశగా అడుగులు వేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వ్యాధులు, జరిగే నష్టాలపై అవగాహన కలిగించాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్‌సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు ఆస్రఫ్ బాషా, పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు రూ.2.50కోట్లు మంజూరు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.2.50కోట్లు మంజూరైనట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లడ్డూ కౌంటర్ తయారీ బిల్డింగ్, నాలుగు గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం, నూతన పరిపాలనా కార్యాలయ భవనం, అదనంగా భక్తుల సౌకర్యార్థం 50గదుల నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు పంపామన్నారు. అన్నదానం కోసం జీప్లస్ బిల్డింగ్ నిర్మాణానికి ఇప్పటికే రూ.2.30కోట్ల నిధులు మంజూరు కాగా రివైజింగ్ కోసం పంపినట్లు వెల్లడించారు. మంజూరైన అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
ఆర్టీసీలో అప్రెంటీస్‌కు దరఖాస్తులు
కర్నూలు సిటీ: ఐటీఐలో డిజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మోషనిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన వారు ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటీస్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ స్టాఫ్ శిక్షణ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.నజీర్‌అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 5 నుంచి వచ్చే నెల 11వ తేదిలోపు ఆన్‌లైన్‌లో www.apprenticerhipi ndia.gov.in అనే వెబ్‌సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో కర్నూలు బళ్లారి చౌరస్తా సమీపంలోని జోనల్ ట్రైనింగ్ కాలేజీలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలన్నారు. వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు రూ.118 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 08518–257025 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
అందుబాటులో
టీటీడీ క్యాలెండర్లు
కర్నూలు కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానముల పంచాంగం క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి అందుబాటులో ఉన్నాయని టీటీడీ కల్యాణ మండపం మేనేజర్ సి.రామ్మోహన్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం సీ.క్యాంప్ టీటీడీ కల్యాణ మండపంలో తగినన్ని క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి అందుబాటులో ఉంచామన్నారు. పెద్ద డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, 12 సీట్స్ క్యాలెండర్ రూ.130, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30, టేబుల్ క్యాలెండర్ రూ.75, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో కూడిన క్యాలెండర్ రూ.20, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్ రూ.15, ఆరుషీట్స్ డిజిటల్ క్యాలెండర్ రూ.450 ధరలతో విక్రయిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 91544 89919 నెంబర్‌ను సంప్రదించాలని విజ్ఙప్తి చేశారు.

క్లాప్ మిత్రల సంక్షేమంపై దృష్టి సారించండి