
అర్చకుల వల్లే ఆలయ ప్రతిష్టకు భంగం
● దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్
తీవ్ర అసంతృప్తి
● తగ్గిన కొలనుభారతి అమ్మవారి
హుండీ ఆదాయం
కొత్తపల్లి: రాష్ట్రంలో ఏకై క సరస్వతీ దేవి క్షేత్రం కొలనుభారతి. అలాంటి ఆలయ ప్రతిష్టను, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల మనోభావాలను అర్చకులే దెబ్బతిస్తున్నారని నంద్యాల జిల్లా దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కొలనుభారతి క్షేత్రంలో ఈఓ రామలింగారెడ్డి, చైర్మన్ వెంకటనాయుడు, సర్పంచు చంద్రశేఖర్‌తో కలిసి హుండీ ఆదాయం లెక్కింపు చేపట్టారు. ఈ ఏడాది మే 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా కేవలం రూ.1,44,115 మాత్రమే రావడంతో ఆశ్చర్యపోయారు.
తీరు మార్చుకోకుంటే సస్పెండ్ చేస్తాం
ఈ సందర్భంగా దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అర్చకుల మధ్య గొడవలు, ప్రవర్తన ద్వారా ఆలయ ప్రతిష్ట మసకబారుతుందన్నారు. అక్షరాభ్యాసాలు, అర్చనలు, సంభావనల పేరుతో భక్తుల నుంచి ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తూ వారి మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల పట్ల దురుసు ప్రవర్తన, సమయపాలన పాటించకుండా ఆలయ ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్ల నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హుండీ ఆధాయం రూ.2 లక్షలకు పైగా వచ్చేదని ఇప్పుడు భారీగా తగ్గిందంటే అర్చకుల అంతర్గత వ్యవహరాలే కారణమన్నారు. ఇప్పటికై నా అర్చకుల ప్రవర్తనలో మార్పురాకపోతే విధుల నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.