
చిరుత గోరు, కణితి కొమ్ము స్వాధీనం
శ్రీశైలంప్రాజెక్ట్: పాత సున్నిపెంట ప్రాంతంలో వై.చెన్నారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గురువారం చిరుతపులి గోరు, కణితి కొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ బబితా కుమారి వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావుకు అందిన రహస్య సమాచారం మేరకు బుధవారం రాత్రి బబితాకుమారి, ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రణతిబాయి, శ్రీశైలం రేంజ్ అధికారి ఎం.పరమేశ్ తనిఖీలు చేపట్టారు. నిందితుడి ఇంట్లో చిరుత గోరు, కణితి కొమ్ము లభ్యమయ్యాయని, చెన్నారెడ్డి అందుబాటులో లేని కారణంగా నోటీసులు ఇచ్చామని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌డీఎఫ్‌ఓ చెప్పారు. పాత తరం వ్యక్తులు వన్యప్రాణుల చర్మాలు, గోర్లు, కొమ్ములు, దంతాలను మూఢ నమ్మకాలతో ఇళ్లల్లో ఉంచుకుంటారని, ఇలాంటి చర్యలు నేరమన్నారు. అలాంటివి కలిగిఉన్న వారు స్వచ్ఛందంగా అటవీ అధికారులకు అందిస్తే సంజాయిషీతో వదిలేస్తామని, లేకపోతే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

చిరుత గోరు, కణితి కొమ్ము స్వాధీనం