
కౌన్సెలింగ్ తికమక!
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ మొదలైంది. ఎస్‌జీటీ పోస్టులు ఎక్కువగా ఉండటంతో మాన్యువల్‌గా, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎస్‌జీటీలకు గురువారం రాత్రి శిక్షణ కేంద్రాల్లోనే కౌన్సెలింగ్ ప్రారంభించారు. కౌన్సెలింగ్‌పై ముందుగానే అవగాహన కల్పించినా విద్యా శాఖ చూపించిన ఖాళీల్లో ఏ స్కూల్ ఎంత దూరంలో ఉందో అభ్యర్థులకు తెలియకపోవడం అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా 3, 4 కేటగిరీల్లోని పోస్టులలో నూతన టీచర్లను నియమిస్తున్నారు. శుక్రవారం నాటికి ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ల కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రక్రియ కొనసాగుతోంది. కౌన్సెలింగ్‌కు హాజరైన టీచర్లందరికీ 11వ తేదీన ఎంపిక చేసుకున్న స్కూళ్ల పేరుతో ఆర్డర్లు జారీ కానున్నాయి. ఈనెల 13న వారికి కేటాయించిన స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌జీటీలగా ఎంపికై న వారిలో అత్యధిక శాతం మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాలు సాధించిన వారున్నారు. దీంతో స్కూళ్లను ఎంపిక చేసుకునే అంశంపై సరైన అవగాహన లేక, కనీసం తెలిసిన వారిని అడిగి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో తికమకపడుతున్నారు. జోనల్ స్థాయిలో టీజీటీ, పీజీటీలకు, ప్రిన్సిపల్ పోస్టులకు ఎంపికై న టీచర్లు శిక్షణ పొందే చోటనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.