
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. గురువారం ఉదయం సంక్షేమభవన్‌లోని తన చాంబర్‌లో సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు జ్వరం, ఇతరత్రా వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పీహెచ్‌సీకి సమాచారం అందించాలన్నారు. ప్రతి వసతిగృహంలో ఫస్ట్‌ఎయిడ్ కిట్లు, ప్రాథమిక మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్టల్ రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, ఎస్.లీలావతి, బి.మద్దిలేటి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. ఆదోని బాలుర వసతి గృహాన్ని స్వచ్ఛ హాస్టల్‌గా నిలిపిన వసతి గృహ సంక్షేమాధికారి సిద్దప్పను ఆమె ఘనంగా సన్మానించారు.
నేటి నుంచి ‘ఎన్‌టీఆర్’
వైద్య సేవలు నిలిపివేత
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీ నుంచి ప్రైవేటు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఎన్‌టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా అందించే వైద్యసేవలు నిలిపివేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ రెడ్డికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా) నాయకులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాహుల్, డాక్టర్ సునిల్ సేపూరి నోటీసులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లకు పైగా ఎన్‌టీఆర్ వైద్యసేవ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని, అందుకే వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో 60 ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత నెలలోనే సంఘం నాయకులు ఓపీ సేవలు బహిష్కరించినా ప్రభుత్వం చర్చ లకు పిలిచి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి విస్మరించడం పట్ల ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నేడు వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
కర్నూలు(టౌన్): కర్నూలు నగరంలోని శ్రీ లక్ష్మీ సమావేశ హాలులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గసమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన తెలిపారు.
అద్దె చెల్లించకుంటే ఖాళీ చేయాల్సిందే!
● ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని దుకాణాదారులకు నోటీసులు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్సుల్లోని దుకాణదారులు పెండింగ్ అద్దెలు చెల్లించకపోతే ఖాళీ చేయిస్తామని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఏడు షాపింగ్ కాంప్లెక్సుల్లో 59 దుకాణాలు, నంద్యాల జిల్లాలోని ఆరు షాపింగ్ కాంప్లెక్సుల్లో 46 దుకాణాలను నిర్వహిస్తూ పేద దళితులు జీవనోపాధి పొందుతున్నారు. ఎస్‌సీ కార్పొరేషన్‌కు అద్దెలు జమ చేయడంలో గత ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అద్దెలను నిక్కచ్చిగా వసూలు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 18న జీఓ 26 జారీ చేసింది. ముచ్చటగా మూడవసారి నోటీసులను అందించారు. కాగా.. ఉమ్మడి జిల్లాలో అద్దె బకాయిలు రూ.1.01 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ.43 లక్షలను చెల్లించారు. మరో రూ.57 లక్షల బకాయి ఉంది. ప్రభుత్వ చర్యల పట్ల ఎస్సీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ