
వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై పోరుబాట
ఈనెల 10 నుంచి వచ్చే నెల 22 వరకు కోటి సంతకాల సేకరణ
కర్నూలు(టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రయివేటీకరణను విరమించుకునేంత వరకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రయివేటీకరించేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందన్నారు. పీపీపీ విధానం పేరిట దాదాపు రూ.లక్ష కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలు, వేలాది ఎకరాల భూములను తన అనయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న చీకటి బాగోతాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 10 నుంచి వచ్చే నెల 22వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ, 28వ తేదీ ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేపడతామన్నారు. వినతిపత్రాలను సంబంధిత ఆర్‌డీవోలు, తహసీల్దార్లకు అందజేస్తామన్నారు. వచ్చే నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు, సమన్వయకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. 23వ తేదీన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కోటి సంతకాల సేకరణను పూర్తి చేసి 24వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతామన్నారు. 26వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర గవర్నర్‌కు అందజేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఈనెల 16వ తేదీ కర్నూలుకు వస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ప్రయివేటీకరణ అంశాన్ని వివరిస్తామన్నారు.
ఈనెల 28న అన్ని నియోజకవర్గాల్లో
నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్ర ప్రదేశ్‌గా
మార్చిన ఘనత చంద్రబాబుదే
ఈనెల 16న ప్రధాని మోదీ దృష్టికి
ప్రయివేటీకరణ అంశం
విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి