నిత్యానందకరి | - | Sakshi
Sakshi News home page

నిత్యానందకరి

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

నిత్యానందకరి అన్నపూర్ణమ్మ దర్శనం.. భక్తజన పరవశం

భారీగా తరలివచ్చిన భక్తజనం సరైన వసతులు లేక అన్నప్రసాదం కోసం భక్తుల పాట్లు అమ్మవారి సేవలో తరించిన తమిళనాడు సీఎం విజయ్‌ నేడు ఇంద్రగిరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అన్నపూర్ణమ్మ దర్శనం.. భక్తజన పరవశం

నమామి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. అన్న ప్రసాదం కోసం భక్తులు క్యూ కట్టారు. మహామండపం ఎదుట నూతన అన్నదానం భవనం బయట భక్తులు వేచి ఉండేందుకు సరైన వసతులు లేకపోవడం, పోలీసు సిబ్బంది తగినంత మంది లేకపోవడంతో తోపులాట చోటు చేసుకుంది.

ఉదయం, సాయంత్రం వేళ భక్తుల రద్దీ..

తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనాలు ప్రారంభం కాగా, అప్పటికే క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు, మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో రద్దీ కనిపించింది. మరో వైపున అనధికార దర్శనాలు అధికం కావడం, ప్రముఖులు దర్శనానికి విచ్చేయడంతో దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ క్యూలైన్లు మినహా మిగిలిన గేట్లకు తాళాలు వేయించారు.

అన్నప్రసాదం కోసం వెతలు..

అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున అన్నదాన భవనం వద్దకు చేరుకున్నారు. భక్తులు వేచి ఉండేందుకు భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో క్యూలైన్లు ఏర్పాటు చేయగా అవి పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు అన్నదానం భవనం బయట వేచి ఉండలేక, వేడికి అల్లాడిపోయారు. ఓ దశలో అన్నదానం పెద్ద డోర్లను తోసుకుంటూ భక్తులు లోపలకు ప్రవేశించడంలో సిబ్బంది చేతులెత్తేశారు. శృంగేరీలో ఉన్న అన్నప్రసాదం తయారీని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి తరలించారు. అక్కడ క్యూలైన్‌లో ఉన్న భక్తులు వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్న ప్రసాదం స్వీకరించేందుకు రెండు గంటలు పైగా క్యూలైన్‌లో వేచి ఉన్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడంతో పాటు కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించార. ఆలయ ప్రాంగణం మొత్తం జల్లెడ పట్టిన సెక్యూరిటీ అధికారులు.. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఆలయ ప్రాంగణం మొత్తం రాష్ట్రపతి సెక్యూరిటీ ఆధీనంలోకి వెళ్లనుంది.

నేడు కొన్ని మార్పులు..

బుధవారం కొండపైన కీలక మార్పులు చేసినట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొండపైకి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7.45 గంటల వరకు ప్రొటోకాల్‌ స్లాట్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ఆకలితో అలమటించే వారికి సాయం చేయడం కనీస మానవ ధర్మం.. అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికే భిక్షను ప్రసాదించిన అమృతమూర్తి అన్నపూర్ణాదేవి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు ఆ ఆది దేవత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో అక్షయపాత్ర ధరించి, ఆదిభిక్షువుకు అన్నాన్ని ప్రసాదిస్తున్న అవతారంలో కొలువైన అమ్మ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి భక్తులు ఆనందంతో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement