మేట వేసిన నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మేట వేసిన నిర్లక్ష్యం

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

బుడమేరు, చంద్రయ్య డ్రైన్లలో మేట వేసిన గుర్రపుడెక్క

పట్టించుకోని పీసీ ప్రాజెక్టు చైర్మన్‌, అధికారులు

రైతులను నట్టేట ముంచుతున్న బుడమేరు, చంద్రయ్య డ్రైన్‌లు

గగ్గోలు పెడుతున్న రైతులు

గుడివాడరూరల్‌: రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ చంకలు కొట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ప్రధాన డ్రైన్లు గుర్రపుడెక్క, తూడుతో మేట వేసుకుపోయి నీటి ప్రవాహానికి అవరోధంగా మారి, చిన్నపాటి వర్షాలకు పంట పొలాలను ముంచి రైతులకు నష్టం కలిగిస్తున్నా నీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. నందివాడ మండలంలోని ప్రధాన డ్రైన్లు అయిన బుడమేరు, చంద్రయ్య, నెహ్రాలీ డ్రైన్లు గుర్రపుడెక్క, తూడుతో నిండి రూపు కోల్పోయాయి. గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియ ద్వారా సంబంధిత డ్రైన్లలో ఏడాది పొడవునా గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించే వారు. సదరు కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు గుర్రపుడెక్క, తూడును తొలగించే పనులను చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు డ్రైన్ల అభివృద్ధి పనులను సాగునీటి సంఘాలకు అప్పగించారు. మేజర్‌ డ్రైన్లు అయిన బుడమేరు, చంద్రయ్య, నెహ్రాలీ డ్రైన్ల పనులను పీసీ ప్రాజెక్టు చైర్మన్‌ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పైబడి కావస్తున్నా ఇప్పటివరకు సదరు పీసీ చైర్మన్‌ డ్రైన్లను పరిశీలించిన దాఖలాలు కానీ, గుర్రపుడెక్క తొలగింపు పనులు కానీ చేపట్టిన సందర్భాలు లేవు.

చంద్రయ్య డ్రైన్‌లో...

చంద్రయ్య డ్రైన్‌ ద్వారా మండవల్లి, గుడివాడ రూరల్‌, నందివాడ మండలాల్లోని గ్రామాలతో పాటు గుడివాడ పట్టణంలోని మురుగు దిగువకు చేరాల్సి ఉంది. డ్రైన్‌లో ఎక్కడబడితే అక్కడ గుర్రపు డెక్క మేట వేసుకుపోవడంతో నీటి ప్రవాహం సవ్యంగా సజావుగా సాగక ఎగువనున్న పంటలను ముంచుతున్నాయి. ముఖ్యంగా లింగవరం, తమిరిశ శివారు నక్కావారిపాలెం, పోలుకొండ రెగ్యులేటర్‌ వద్ద భారీస్థాయిలో గుర్రపుడెక్క మేట వేసుకుపోయింది. గుర్రపుడెక్క ధాటికి పోలుకొండ రెగ్యులేటర్‌ వద్ద ప్రధాన షట్టర్‌ సైతం కొట్టుకుపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. బుడమేరు ప్రధాన డ్రైన్‌ సైతం ఇదే పరిస్థితి. ఇటీవల వచ్చిన అల్పపీడన వర్షాలకు పుట్టగుంట వంతెన వద్ద భారీగా గుర్రపుడెక్క మేట వేసుకుపోయి నీటి ప్రవాహం వంతెనపై నుంచి వెళ్లడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వందలాది ఎకరాలను ముంచేసింది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుర్రపుడెక్క సక్రమంగా తీయకపోవడం ముంపునకు ప్రధాన కారణమంటూ రైతులు వాపోతున్నారు. పీసీ ప్రాజెక్టు చైర్మన్‌ వైఫల్యంతోనే తాము నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెహ్రాలీ డ్రైన్‌ సుమారు పది కిలోమీటర్ల మేర కిక్కిస, తూడు, గుర్రపుడెక్కతో పూర్తిగా నిండి రూపు కోల్పోయింది. వాస్తవానికి వెన్ననపూడి వద్ద నుంచి నీరు చంద్రయ్య డ్రైన్‌లో నందిగామలంక వద్ద కలవాల్సి ఉంది. డ్రైన్‌ రూపు కోల్పోవడంతో నీటి ప్రవాహం సక్రమంగా సాగక, ఎగువనున్న చేపల చెరువులు ముంపునకు గురవుతున్నాయి.

పనులు చేయకుండానే బిల్లులు

వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియ ద్వారా సదరు డ్రైన్ల అభివృద్ధికి ఏడాది పొడవునా పనులు చేయడానికి కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు మెయింటినెన్స్‌ చేసే విధంగా సంబంధిత అధికారుల పర్యవేక్షణతో పాటు అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతల శ్రేయస్సే లక్ష్యంగా పనులను నీటి సంఘాలకు అప్పగించారు. మూడు పార్టీల నేతలు దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన పనులు చేయకుండానే బిల్లులు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పీసీ ప్రాజెక్టు చైర్మన్‌ జనసేనకు చెందిన అవనిగడ్డ ప్రాంత వ్యక్తికి అప్పగించారు. ఆయన డ్రైన్లు పరిశీలించిన దాఖలాలు లేవు. పనులు చేసిన సందర్భాలు లేవు. అధికారులు పనులు చేయాల్సిందిగా కోరినా అధికారులను సైతం బెదిరించిన సందర్భాలు ఉన్నాయంటూ అధికారులు వాపోతున్నారు. ఇటు రైతులు పనులు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినా.. సదరు పీసీ చైర్మన్‌ పనులు చేయరు, బిల్లులు మాత్రం కావాలి.. ఇష్టం వచ్చిన వాళ్లకు చెప్పుకోండి అంటూ అడిగిన వాళ్లను బెదిరిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం డ్రైన్ల అభివృద్ధిని గాలికి వదిలేసి రైతులకు నష్టం కలిగిస్తున్నా అటు ఉన్నతాధికారులు కానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు, జిల్లాస్థాయి ఉన్నతాధికారులు డ్రైన్ల అభివృద్ధిపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

తమిరిశ శివారు నక్కావారి పాలెం వద్ద చంద్రయ్య డ్రైన్‌లో మేటవేసిన గుర్రపుడెక్క

పుట్టగుంట గ్రామం వద్ద బుడమేరులో పేరుకుపోయిన గుర్రపుడెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement