కూటమిలో లోకల్‌ వార్‌! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో లోకల్‌ వార్‌!

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

● సెంట్రల్‌ నియోజవకర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇప్పుడు తన కొడుక్కి మేయర్‌ సీటు కోసం భారీ ఆశలు పెట్టుకుంటే చంద్రబాబు, లోకేశ్‌ గండి కొట్టారని రగలిపోతున్నారట. సదరు నేత ఇప్పటికే నగరంలో తమ బలాబలాలు బేరీజు వేసుకుని, ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుంది? ఎలక్షన్‌ ఎలా చేయాలని లెక్కలు వేసి పెట్టుకున్నారట. ఇటీవల విజయవాడలో జరిగిన ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమం కూడా విజయవంతం చేయడానికి భారీగా జన సమీకరణ, ఫ్లెక్సీలు, బ్యానర్లు మందు, బిర్యానీల కోసం మంచినీళ్లలా ఖర్చు పెడితే ఇలా చేయడం ఏంటని వాపోతున్నట్లు భోగట్టా. ● మరోవైపు ఈస్ట్‌ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి సైతం తన భార్యను నిలబెట్టేందుకు పావులు కదిపారు. వీరిద్దరే కాకుండా చాలామంది ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తున్నాం గనుక తమకే కేటాయించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ వద్ద అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే వీరందరిని కాదని చంద్రబాబు వ్యూహాత్మకంగానే జనసేనకు ఇచ్చి తమకు రాజకీయంగా అన్యాయం చేశారని వాపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు జనసేనకు కేటాయించే అవకాశం పచ్చనేతల ఆశలు గల్లంతు సీఎం చంద్రబాబు, లోకేశ్‌ వ్యూహాత్మకంగానే సీటు వదిలేశారంటున్న తమ్ముళ్లు సోషల్‌ మీడియా వేదికగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

పవన్‌ మాటలతో మంట..

కాక రేపుతున్న స్థానిక సంస్థల సీట్ల పంపకాలు

సాక్షి, విజయవాడ: మునిసిపల్‌ ఎన్నికల నగారా మోగకముందే కూటమిలో రాజకీయం అగ్గిరాజుకుంది. సోమవారం రిజర్వేషన్లు వెలువడిన వెంటనే కూటమిలో సీట్ల పంపకాల విషయంలో వార్‌ మొదలైంది. నిన్నటి వరకు మేయర్‌ స్థానాల కోసం భారీగానే ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన టీడీపీ నేతలు.. జనసేనకు ఇస్తున్నట్లు వార్తలు రావడంతో లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థలతో పాటు తాడిగడప, పెడన, గుడివాడ, ఉయ్యూరు, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ మునిసిపాలిటీల్లో రిజర్వేషన్లు తారుమారు కావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విజయవాడ మేయర్‌ పీఠం కోసం అటు కూటమి పార్టీలో, ఇటు వైఎస్సార్‌ సీపీలో తీవ్ర పోటీ కనిపిస్తోంది. అయితే విజయవాడ, మచిలీపట్నం జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ నేతల ఆశలపై నీళ్లు..

విజయవాడ నగర మేయర్‌ పీఠం తమకు అంటే తమకే కావాలని టీడీపీ నేతలు పోటాపోటీగా వ్యూహాలు పన్నుతూ వచ్చారు. అధిష్టానానికి సంకేతాలు పంపడంతో పాటు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇస్తున్నట్లు తెలుస్తుండటంతో.. ఇంతవరకు మేం చేసిందంతా ఇందుకా.. అని ఫైర్‌ అవుతున్నారట.

మచిలీపట్నం కథ మరోలా..

మచిలీపట్నం కార్పొరేషన్‌లో ఇటీవల ఇద్దరు జనసేన నేతలు మేయర్‌ పీఠం కోసం వీధికెక్కారు. మేయర్‌ సీటు తమది అంటే తమదే అంటూ ఇద్దరు నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ సవాల్‌ విసురుకున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం కార్పొరేషన్‌ బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఆ ఇద్దరికీ నిద్ర పట్టడం లేదట.

రిజర్వేషన్లు ఉల్టా కావడంతో..

ఎన్టీఆర్‌ జిల్లాలోని కొండపల్లి ఎస్సీ మహిళకు, జగ్గయ్యపేట జనరల్‌ మహిళ, తిరువూరు బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కాగా.. నందిగామ మునిసిపాలిటీ మాత్రం అన్‌ రిజర్వ్‌డ్‌ అయింది. మచిలీపట్నం జిల్లా పరిధిలోని మచిలీపట్నం బీసీ మహిళ, పెడన జనరల్‌ మహిళ, గుడివాడ బీసీ మహిళ, ఉయ్యూరు ఎస్సీ జనరల్‌, తాడిగడప బీసీ జనరల్‌కు కేటాయించారు. దీంతో వీటిలో పాగా వేద్దామని నిన్నటి వరకు ఆశలు పెట్టుకున్న వారికి రిజర్వేషన్‌ దెబ్బకొట్టడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

డెప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల కాకినాడలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన మాటలు టీడీపీ, జనసేన మధ్య వివాదానికి దారి తీశాయి. సోషల్‌ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో సునాయాసంగా గెలిచి పోతామని భావిస్తున్న ఆశావహులు కాస్త.. వీరి గొడవలతో తామెక్కడ బలవుతామో అనే డైలమాలో పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement