ఏడాదిగా పెరిగిన వడ్డీలు
815 ఎకరాల్లో దెబ్బతిన్న పసుపు
గతేడాది మండలాల వారీగా చేపట్టిన సాగు వివరాలు
● గతేడాది నిండాముంచిన తుపాన్లు, వరదలు ● కూటమి ప్రభుత్వంలో ఏడాదిగా బీమా చెల్లించకుండా కాలయాపన
చల్లపల్లి: ‘అందిన కాడికి అప్పులు తెచ్చి పంట వేస్తే ప్రకృతి కరుణించక పంట పోయింది. కనీసం బీమా వస్తుందనుకుంటే అదీ రాలేదు. పెరిగిన వడ్డీలు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక నుయ్యో.... గొయ్యో చూసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. – పసుపు, వరి రైతుల ఆవేదన’ ప్రకృతి కన్నెర్ర చేస్తే అన్నదాత జీవితం ఏవిధంగా చిధ్రమవుతుందో చెప్పడానికి గతేడాది జరిగిన పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతన్నలకు ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదైనా పరిహారం రాక, నష్టపోయిన పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక, కొత్త పంట వేసుకునేందుకు అప్పులు పుట్టుక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
రైతును ముంచిన వరుస ప్రకృతి విపత్తులు
గతేడాది వచ్చిన మొంథా తుఫాను, భారీ వర్షాలు, ఈదురు గాలులు వరి పొలాలు, నెల రోజుల వ్యవధిలో కరకట్ట దిగువున్న ఉన్న వాణిజ్య పంటలను మూడు సార్లు కృష్ణానది వరదలతో ముంచెత్తింది. దీని కారణంగా పసుపు, అరటి, మొక్కజొన్న, కంద వంటి వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పసుపు పంట రోజుల తరబడి నీటిలో మునగడంతో దుంపలు కుళ్లిపోయి పూర్తిగా దెబ్బతింది. దిక్కుతోచన స్థితిలో ఉన్న రైతులు ఆశ చావక మరలా అప్పులు చేసి దుంపలు నాటినా మరలా వచ్చిన వరదలు వాటిని కూడా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో రైతన్నలు పూర్తిగా పీకల్లోతు కష్టాల్లో, అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
మారిన విధానాలు... రైతన్నకు శాపాలు
వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వ హయాంలో వాతావరణ ఆధారిత పంటల బీమాను అమలు చేసేవారు. దీనికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని కూడా అప్పట్లో ప్రభుత్వమే చెల్లించింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన పంటకు వెంటనే బీమా పరిహారం కూడా చెల్లించే ఏర్పాట్లు చేసి అన్నదాతలు అండగా నిలిచారు. అయితే నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విధానాన్ని మార్చి బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఆ భారాన్ని పూర్తిగా అన్నదాతలపై వేశారు. వాతావరణ ఆధారిత బీమా స్థానంలో దిగుబడి ఆధారిత బీమా విధానాన్ని తెచ్చింది. కూటమి ప్రభుత్వం వెన్ను చూపడంతో పసుపు పంటకు ఒక్కొ ఎకరాకు రూ.1,100, వరి పంటకు రూ.840 చొప్పున నానా తిప్పలు పడి మరీ రైతులే ప్రీమియం కట్టుకున్నారు.
జిల్లా యూనిట్ విధానంతో అన్యాయం
దిగుబడి ఆథారిత బీమా విధానంలో జిల్లాను యూనిట్‌గా తీసుకుని గత ఐదేళ్ల దిగుబడిని సగటుతో నష్టాన్ని లెక్కించడం వల్ల పంట నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగినా.. జిల్లా మొత్తంగా దిగుబడి బాగుందనే సాకుతో రైతులకు రావాల్సిన పరిహారం వారికి దక్కకుండా పోతోంది. జిల్లా యూనిట్‌గా కాక ఒక గ్రామాన్నో, లేదా ఒక మండలాన్నో యూనిట్‌గా తీసుకుంటే కొంత వరకూ ఇబ్బందులు తొలగుతాయని రైతులు వాపోతున్నారు.
ఏడాది గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు చక్రవడ్డీలు పెరిగిపోతుండటంతో అన్నదాతలు మనుగడ అగమ్యగోచరంగా మారింది.
పరిస్థితి విషమించక ముందే ప్రభుత్వం వెంటనే స్పందించి పసుపు పంటల బీమా పరిహారాన్ని తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే ఇతర పంటకు మొంథా తుఫాను, వరద సాయాలను కూడా విడుదల చేయాలని వేడుకుంటున్నారు.
మండలం ఎకరాలు
తోట్లవల్లూరు 2340
పెనమలూరు 387
కంకిపాడు 269
చల్లపల్లి 189
మోపిదేవి 150
ఉయ్యూరు 95
మొవ్వ 60
ఘంటసాల 40
పమిడిముక్కల 39.50
అవనిగడ్డ 22
పామర్రు 18
పెదపారుపూడి 3
ఎకరాలు మొత్తం 3,613
కృష్ణానదికి వరదలు, మొంథా తుఫాన్ వల్ల జిల్లాలో 668 మంది రైతులకు చెందిన 815.46 ఎకరాల్లో పసుపు పంట దెబ్బతింది. రూ.1.15 కోట్లు పంట నష్టం అంచనా వేసి పంపామని జిల్లా ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు జె.జ్యోతి చెప్పారు.


