పెనమలూరు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప గ్రామంలో నిర్మాణ సంస్థ ప్రాంగణంలో ఉంచిన 77 కాయిళ్ల రాగి వైర్లు ఈ నెల 3న చోరీకి గురయ్యాయి. వాటి విలువ రూ.5 లక్షలు ఉంటుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు తనిఖీలు చేపట్టగా వణుకూరు గ్రామ శివారులో సంచరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.5 లక్షల విలువైన కేబుళ్లతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నిందితులు సతీష్‌శంకర్, దుర్గేస్‌చిత్రాన్‌జైస్వాల్, ఆకాస్‌కృష్ణబావనే, నిజాంఆప్తాల్ అన్నారీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేద్‌లాల్ రామ్‌లాల్‌రౌత్‌లను అరెస్ట్ చేశారు. బహుళ అంతస్తుల నిర్మాణాలు చేసే వారు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సీఐ వెంకటనారాయణ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు తిరిగితే వెంటనే 112 కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఎడ్లంక(అవనిగడ్డ): కృష్ణానదిలో ఈ నెల 4వ తేదీన మేకలను మేపడానికి వెళ్లి గల్లంతైన మునిపల్లి బాలస్వామి(70) మృతదేహం సోమవారం లభ్యమైంది. మేకలను మేపేందుకు వెళ్లిన బాలస్వామి జాడ ఆదివారం నుంచి కనిపించలేదు. దీంతో బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. కృష్ణానదిలో నాలుగు పడవల ద్వారా గాలించగా ఎడ్లంక సమీపంలో మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


