ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సోమవారం పరిశీలించారు. తొలుత ఘాట్‌రోడ్డుకు చేరుకున్న కమిషనర్ కొండ రాళ్లు విరిగి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి ఆదివారం నుంచే ప్రారంభమయ్యే ఉత్సవాలకు రెండు రోజుల ముందుగానే పనులు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుని, నూతన పూజా మండపాన్ని పరిశీలించారు. ఉత్సవాల్లో అమ్మవారికి జరిగే ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, కుంకుమార్చనకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన కమిషనర్ ఉత్సవాలలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీ అధికమైనప్పుడు ఎటువంటి తోపులాట జరగకుండా చూడాలని, అందుకు ముందుగానే బ్యారికేడ్లు, రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు విచ్చేస్తారనే అంచనాలు ఉన్నాయని, చేపట్టిన అన్ని ఇంజినీరింగ్ పనులు సకాలంలో పూర్తి కావాలని ఆదేశించారు. దేవస్థాన ఈవో శీనానాయక్, ఈఈ రమా, ఇంజినీరింగ్ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
కోనేరుసెంటర్: మీ కోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. కొన్ని ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసంలో మొత్తం 52 అర్జీలను ఎస్పీ అందుకున్నారు.
మహిళపై లైంగిక దాడి.. కేసు నమోదు
గన్నవరం: మానసిక స్ధితి సరిగ్గా లేని ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ మహిళ మానసిక, శారీరక అభివృద్ధి చెందక తల్లి సంరక్షణలో పెరుగుతుంది. ఈ నెల 4న ఆమె తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతుండడంతో ఆమె తల్లి తొలుత గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ ఆ మహిళను పరీక్షించి వైద్యులు రెండు నెలల గర్భవతిగా నిర్ధారించారు. ఆమెను తల్లి గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన విషయం చెప్పింది. మూడు నెలలు క్రితం స్థానిక ఇస్లాంపేటకు చెందిన ఇద్దరు యువకులు జెండా చెట్టు వద్ద ఖాళీ ప్రదేశానికి బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు, ఎవరికై న చెబితే చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
తోట్లవల్లూరు: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామంలోని పీహెచ్‌సీకి సమీపంలో నివసించే పోతుగంటి సత్యన్నారాయణ చిన్న కుమార్తె లక్ష్మీప్రియాంక(27)కు గొల్లపూడికి చెందిన వేల్పూరి అశోక్‌కుమార్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు జరగటంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి లక్ష్మీప్రియాంక పుట్టింట్లోనే ఉంటోంది. గత శనివారం భర్త అశోక్‌కుమార్ కోర్టు నోటీస్‌ను లక్ష్మీప్రియాంకకు పంపించాడు. దీంతో ఆమె అదే రోజు గొల్లపూడిలోని భర్త ఇంటికి వెళ్లి వచ్చింది. సోమవారం తల్లిదండ్రులు సత్యన్నారాయణ, ధనలక్ష్మి విజయవాడలోని ఆస్పత్రికి వైద్యచికిత్స కోసం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరేసుకుని విగతజీవిగా ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తన ఆత్మహత్యకు భర్త, అత్త, చిన్నత్త, ఆడపడుచులే కారణమని మృతురాలు లక్ష్మీప్రియాంక రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ఘటనా ప్రాంతాన్ని తహసీల్దార్ కుసుమకుమారి, పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సందర్శించి పరిశీలించారు. సత్యన్నారాయణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


