ఘంటసాల: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఘంటసాల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో రబీ విత్తన దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.విశాలాక్ష్మి మాట్లాడుతూ వరి, మినుము, పెసర పంటలను ఆశించే వివిధ చీడ పీడలు, సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి.సుధారాణి మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయ పరిధిలోని సంస్థల నుంచి నాణ్యమైన విత్తనాలను రైతులు కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరిసత్యనారాయణ మాట్లాడుతూ.. రబీ మాగాణి అపరాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు. రబీకి అనువైన మినుము, పెసర పంటల్లో మేలైన వంగడాల ఎంపికలో పాటించాల్సిన సూచనలు, వాటి గుణగణాలు విశదీకరించి చెప్పారు.
19 రకాల విత్తనాల ప్రదర్శన..
అపరాల పంటల్లో ముఖ్యమైన తెగుళ్లు, సమగ్ర సస్యరక్షణను ఏఆర్‌ఎస్ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ నాగ హరిచందన రైతులకు తెలియజేశారు. అనంతరం ఉత్తమ రైతు కొల్లి సాంబశివారెడ్డిని ఏఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముందుగా ఘంటసాల విత్తన పరిశోధన స్థానం ప్రాంగణంలో 19 రకాల మినుము, పెసర విత్తనాలను రైతుల ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ జె.పద్మావతి, రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ యు.నిఖిల్ సాగర్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, మండల వ్యవసాయ శాఖాధికారి డి.అనూష, రైతు నాయకులు వేమూరి రత్నగిరిరావు, రైతులు, ఏఆర్‌ఎస్ సిబ్బంది, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


