భార్యపై రాడ్‌తో భర్త దాడి | - | Sakshi
Sakshi News home page

భార్యపై రాడ్‌తో భర్త దాడి

Oct 6 2026 2:06 AM | Updated on Oct 6 2026 2:06 AM

భార్యపై రాడ్‌తో భర్త దాడి దసరాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన డెప్యూటీ ఎంపీడీవోల సంఘ నూతన కార్యవర్గం హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యక్షుడిగా సన్నిధి నాగసాయి శ్రీనివాస్‌

పెనమలూరు: పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే ఎలా అని భార్య భర్తను ప్రశ్నించటంతో ఆమైపె భర్త ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక శ్రీనగర్‌కాలనీలో టమటం విజయదుర్గ(32) భర్త విజయ్‌బాబు, ఇద్దరు కుమార్తెలు నివాసం ఉంటున్నారు. విజయ్‌బాబు పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతను మద్యానికి బానిసై పనులకు సక్రమంగా వెళ్లటం లేదు. పైగా కుమార్తెలను తరచూ వేధించసాగాడు. ఈ విషయమై భార్య పనికి వెళ్లమని అతని సెల్‌ ఫోన్‌ తీసుకోగా ఆగ్రహంతో విజయ్‌బాబు ఇనుప రాడ్‌తో ఆమె తలపై దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు భర్తపై కేసు నమోదు చేశారు.

మచిలీపట్నంటౌన్‌: రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని ఐదు ఏపీఎస్‌ఆర్టీసీ డిపోల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు కృష్ణాజిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి 42 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామన్నారు. బస్సుల రద్దీని బట్టి సర్వీసుల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. టికెట్లను అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నందివాడ: మండలంలోని జనార్దనపురం గ్రామంలో మంగళవారం జరగనున్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, పలువురు మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో కలెక్టర్‌ డీకే బాలాజీ సోమవారం జనార్దనపురం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని సచివాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ను కలెక్టర్‌ బాలాజీ పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, పరిసరాల పరిశుభ్రత, వేదిక, ఇతర మౌలిక సదుపాయాలను దగ్గరుండి పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మచిలీపట్నంటౌన్‌: కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న డెప్యూటీ ఎంపీడీవోల (ఎంఎస్‌జీవో) సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జిల్లాలోని డెప్యూటీ ఎంపీడీవోల సంఘ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా కె.నరసింహారావు(కృత్తివెన్ను), గౌరవాధ్యక్షుడిగా ఎం.ఎన్‌.ఎస్‌.మూర్తి(మచిలీపట్నం), కార్య దర్శిగా వి.శామ్సన్‌బాబు(తోట్లవల్లూరు), ఉపాధ్యక్షులుగా ఈ.హారతి నిర్మల(ఉయ్యూరు), వై.శివరామప్రసాద్‌ (ఘంటసాల), జాయింట్‌ సెక్రటరీగా వి.ఎలీషారావు (గుడ్లవల్లేరు), ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా డి.ఝాన్సీలక్ష్మి (బంటుమిల్లి), కోశాధికారిగా కె.సంపత్‌ కుమార్‌ (బాపులపాడు)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఆ సంఘ సభ్యులు అభినందించారు.

మచిలీపట్నంఅర్బన్‌: హాకీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్‌ హాకీ ఆంధ్రప్రదేశ్‌ నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్‌ 12వ వార్షిక జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం మార్పులు, చేర్పులు సందర్భంగా సన్నిధి నాగసాయి శ్రీనివాస్‌కు ఉపాధ్యక్ష పదవి దక్కింది. జిల్లాలో హాకీ అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం పట్ల హాకీ క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement