కూటమి పాలనలో సమస్యలతో ఉపాధ్యాయులు సతమతం వారం రోజులుగా బీఆర్ అంబేడ్కర్ గురుకులాల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు దీక్ష నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సమాజానికి విద్యను అందించి చైతన్యబాటలో పయనింపజేసే మహానీయులు గురువులు. అలాంటి మహనీయులను గౌరవించుకునేందుకు అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. యావత్ ప్రపంచమంతా ఎంతో ఆనందంగా వేడుకలకు సిద్ధం అవగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గురువులు రోడ్డుపాలవుతున్నారు. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలకు చెందిన పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారం రోజులుగా నగరంలో దీక్షలు చేపట్టారు. టెట్ పరీక్ష ఒకవైపు, ఆర్థిక అంశాలు, బోధనేతర పనులు మరోవైపు ఉపాధ్యాయులను వెంటాడుతున్నాయి.
సమస్యల సుడిలో గురువులు..
రాష్ట్రంలో 190 బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, కళాశాలలు పనిచేస్తున్నాయి. వాటిల్లో సుమారు 1,800 మంది పార్ట్‌టైమ్ ఉద్యోగులు పుల్‌టైమ్ విధులు నిర్వహిస్తున్నారు. 14 ఏళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయుల స్థాయిలో విధులు నిర్వహిస్తున్నా నెలకు రూ.24,150 చొప్పునే వేతనాలను అందిస్తున్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం పార్ట్‌టైమ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
టెట్‌పైనా ఆందోళనలో ఉపాధ్యాయులు..
రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం ఇన్ సర్వీస్ టెట్ పరీక్షను ఈ నెల 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ నెల ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకూ ఎఫ్‌ఏ–2 పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్ధులను తీర్చిదిద్ది, తామూ పరీక్షకు సన్నద్ధం కావాలంటే ఇబ్బందిగా ఉందంటూ ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఎఫ్‌ఏ–2 పరీక్షలను పోస్ట్‌పోన్ చేయాలని విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదు. 11 నుంచి జరిగే టెట్ పరీక్షకు తాము సరిగా సిద్ధంగా లేమని వారు వాపోతున్నారు. మరోవైపు టెట్ రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి రాగానే అనేక ఆర్థ్ధికాంశాలను అమలు చేస్తామంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ హడావుడి చేసి తమను మోసగించారని టీచర్స్ చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నప్పటికీ ఉపాధ్యాయులకిచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని వారు మండిపడుతున్నారు. తమకు రావాల్సిన డీఏలను ఇప్పటివరకూ ఇవ్వకపోవడంతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని వారు చెబుతున్నారు.


