మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఆర్‌ఏఏపీ)లో ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అసోసియేషన్ కోశాధికారి గుడిపాటి మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీ కామ్మ ఖాదర్ బాబు, అథ్లెటిక్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొక్కిలిగడ్డ కృష్ణ వంశీ.. తమ రాజీనామాలను తక్షణమే అమలులోకి వచ్చేలా చూడాలని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌కు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సొసైటీ రిజిస్ట్రార్‌కు మెయిల్, పోస్టు ద్వారా రాజీనామా పత్రాలను పంపారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అసోసియేషన్‌లో జరుగుతున్న కీలక పరిణామాలు సైతం తమకు తెలియజేయడం లేదని, అలాంటడప్పుడు సభ్యులుగా ఉండలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆర్‌ఏఏపీలో జరుగుతున్న వ్యవహారాల గురించి సాక్షి దినపత్రికలో సెప్టెంబర్ 11న ‘స్వప్రయోజనాలే గురి’ శీర్షీకతో కథనం ప్రచురితమైంది. ఈ కథనం ప్రచురితమైన వెంటనే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలోని సభ్యులు ఆర్‌ఏఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. అసోసియేషన్‌కు సంబంధించిన రికార్డులు తమకు అందచేయాలంటూ శాప్ అధికారులు ఆర్‌ఏఏపీ అధ్యక్షుడికి నోటీసు పంపారు. సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్తలోని అంశాలకు మరింత బలం చేకూరేలా అసోసియేషన్‌లోని ముగ్గురు సభ్యులు ఇప్పుడు రాజీనామా చేశారు.


