కనిపించకుండా పోయిన ఝాన్సీరాణిగా గుర్తింపు
చల్లపల్లి: చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ గుండేరులో శవమై తేలిన ఘటన మండల పరిధి కొత్తమాజేరులో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలిని ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామానికి చెందిన తెనాలి ఝాన్సీరాణి (53)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి వెంకటేశ్వరరావు, ఝాన్సీరాణి దంపతులు. సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు మృతిచెందాడు. అప్పటి నుంచి ఝాన్సీరాణికి మతిస్థిమితం సరిగా ఉండటం లేదు. చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి పట్టుకుని ఆమెను ఇంటికి తీసుకురావడం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే ఈనెల 2న ఝాన్సీరాణి మరలా ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె భర్త వెతుకుతూనే ఉన్నారు. ఆదివారం ఉదయం కొత్తమాజేరు గుండేరు కాలువలో ఓ మృతదేహం గుర్రపుడెక్కలో చిక్కుకుని ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు చల్లపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహంపై షర్టు ధరించి ఉండటంతో తొలుత అది మగమనిషి మృతదేహంగా భావించారు. తీరా బయటకు తీశాక చీరపై షర్టు ధరించిన మహిళ మృతదేహంగా గుర్తించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చి చూసిన తెనాలి వెంకటేశ్వరరావు ఆ మృతదేహం తన భార్య ఝాన్సీరాణిదిగా గుర్తించారు. అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గరగ నృత్యం జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక
మధురానగర్(విజయవాడసెంట్రల్): సత్యనారాయణపురం శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు గరగ నృత్య ప్రదర్శనతో అఖిల భారత స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గణిత విజ్ఞాన మేళా, సంస్కృతి మహోత్సవంలో భాగంగా నిర్వహించిన నృత్య పోటీల్లో శ్రీ విజ్ఞాన విహార పాఠశాల విద్యార్థులు గరగ నృత్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు తొలుత సంకుల స్థాయిలో, అనంతరం ప్రాంతీయ స్థాయిలోనూ విజయం సాధించి ప్రతిభ చాటుకున్నారు. అనంతరం జరిగిన పోటీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పోటీపడి విజయం సాధించి అఖిల భారత స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జరుగనున్న అఖిల భారత స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రెసిడెంట్ బీవీఎస్‌టీ సాయి హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూడా తమ విద్యార్థులు ప్రతిభను చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఇంతటి ప్రతిభ సాధించడం నగరానికి, పాఠశాలకు గర్వకారణమన్నారు. విద్యార్థులు జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.


