కోనేరుసెంటర్: ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బందరు మండలం కెపిటిపాలెం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పోతురాజు, భార్య నాగలక్ష్మి, కుమారుడు గోపిరాజు(26)తో కలిసి శనివారం ఉదయం బోటులో చేపల వేటకు వెళ్ళారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా పెద్ద అల బోటును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బోటులో ఉన్న ముగ్గురు సముద్రంలో పడిపోయారు. పోతురాజు, నాగలక్ష్మి అదృష్టవశాత్తు ఒడ్డుకు చేరుకోగా గోపిరాజు బోటులో ఇరుక్కుపోయాడు. అల తాకిడికి బోటుతో పాటు గోపిరాజు సముద్రంలో మునిగిపోయాడు. జరిగిన ప్రమాదం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన బోట్లు వేసుకుని ప్రమాదస్థలికి చేరుకుని ఒడ్డున చెట్లు పట్టుకుని వేలాడుతున్న పోతురాజు, నాగలక్ష్మిలను సురక్షితంగా గ్రామంలోకి తీసుకువెళ్లారు. గల్లంతైన గోపిరాజు ఆచూకీ కోసం నాలుగు బోట్లును సముద్రంలోకి పంపి గాలింపు చర్యలు చేపట్టారు. జరిగిన ప్రమాదంపై బందరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన గోపిరాజుకు పేరుపాలెంకు చెందిన పూజిత అనే యువతితో పది నెలల క్రితం వివాహం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.


