సాయమియ్యవా సఖి? | - | Sakshi
Sakshi News home page

సాయమియ్యవా సఖి?

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

సాయమియ్యవా సఖి? మచిలీపట్నంఅర్బన్‌: ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచి, వారి సమస్యలకు భరోసా కల్పించాల్సిన సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ వ్యవస్థ కుంటుపడింది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బాధిత మహిళలు, బాలికల సహాయ కేంద్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆశ్రయించే వారికి సకాలంలో అవసరమైన సేవలు అందటం లేదు. మహిళల భద్రత, సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తగినంత చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలకు అత్యవసర సేవలు అందించాల్సిన సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌లో కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024–25లో 63 కేసులు, 2025–26లో 413 కేసులు నమోదు కాగా.. 2026 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల్లోనే 321 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అవసరమైన పోస్టులను భర్తీ చేయకుండా సిబ్బంది కొరతతోనే కేంద్రాన్ని నడిపించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‌ జారీ చేసి, అందుకు అనుగుణంగా సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. అనంతరం 2024 మార్చి 14న మచిలీపట్నంలో బాధిత మహిళలు, బాలికల సహాయ కేంద్రం సఖి జిల్లా కేంద్రం అధికారికంగా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో బాధిత మహిళలకు అందాల్సిన కౌన్సెలింగ్‌, న్యాయ, వైద్య తదితర సేవలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. మహిళలకు రక్షణ, కౌన్సెలింగ్‌, న్యాయ, వైద్య, పోలీసు సహాయం ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే మచిలీపట్నం సఖి కేంద్రంలోనే కౌన్సెలింగ్‌, న్యాయ సహాయం, సహాయక సేవలకు సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉండటం కేంద్రం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహిళల సమస్యలను కేవలం ఫిర్యాదులుగా నమోదు చేసి పంపించడం కాకుండా, వారి పరిస్థితిని సున్నితంగా అర్థం చేసుకుని అవసరమైన సేవలను సమన్వయం చేయాల్సిన బాధ్యత సఖి కేంద్రంపై ఉంది. ముఖ్యంగా భద్రతకు ముప్పు లేని దాంపత్య సమస్యల్లో నిష్పక్షపాత కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారానికి అవకాశం కల్పించాలి.

కీలక పోస్టుల భర్తీ ఎప్పుడు?

జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్‌లో బాధిత మహిళలకు మానసిక ధైర్యం కల్పించాల్సిన సైకో సోషల్‌ కౌన్సిలర్‌ పోస్టు 2026 సెప్టెంబర్‌ 3 నుంచి ఖాళీగా ఉంది.

న్యాయ సహాయం అందించాల్సిన పారా లీగల్‌ పర్సనల్‌, సహాయక సేవలకు సంబంధించిన మల్టీ పర్పస్‌ వర్కర్‌ పోస్టులు 2025 అక్టోబర్‌ 22 నుంచి ఖాళీగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు భర్తీ కాలేదు.

మరోవైపు పోలీసు శాఖతో సమన్వయం చేయాల్సిన పోలీసు ఫెసిలిటేషన్‌ ఆఫీసర్‌ డెప్యూటేషన్‌ పోస్టు ప్రస్తుతం ‘హోల్డ్‌’లో ఉంది.

కీలక పోస్టులే ఖాళీగా ఉండటంతో బాధిత మహిళలకు మానసిక ధైర్యం కల్పించడం, కుటుంబ సమస్యలను సున్నితంగా పరిష్కరించడం, భద్రతకు ముప్పు లేని సందర్భాల్లో దాంపత్య విభేదాలకు సయోధ్య మార్గం చూపడం వంటి సేవలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది.

మహిళలకు రక్షణ, కౌన్సెలింగ్‌, న్యాయ, వైద్య, పోలీసు సహాయం ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సఖి కేంద్రంలోనే కీలక సిబ్బంది కొరత ఏర్పడటంతో కేంద్రం లక్ష్యం నీరుగారే పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్వహణపైనా విమర్శలు..

రాష్ట్ర వ్యాప్తంగా సఖి కేంద్రాల కౌన్సెలింగ్‌ తీరుపై విమర్శలు, ఫిర్యాదులు వస్తున్నాయి. మచిలీపట్నం సఖి కేంద్రం విషయంలోనూ కుటుంబ సమస్యల పరిష్కారానికి సంబంధించి కౌన్సెలింగ్‌ తీరుపై కొందరు బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, బాధిత మహిళలకు సకాలంలో నాణ్యమైన కౌన్సెలింగ్‌, న్యాయ, పోలీసు తదితర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

– గడ్డం రవికుమార్‌, అధ్యక్షుడు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, విజయవాడ

కేసులు పెరుగుతున్నా..

వైఎస్సార్‌ సీపీ హయాంలో పోస్టుల భర్తీ..

నీరుగారుతోన్న లక్ష్యం..

బందరు సఖి కేంద్రంలో

‘కౌన్సెలింగ్‌’ కరువు

కీలక పోస్టులన్నీ ఖాళీగానే..

భర్తీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యం

మహిళలకు అభయమివ్వని కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement