వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ఉమ్మడి జిల్లాలోని ఎయిడెడ్ ఉపాధ్యాయుల మిగులు సిబ్బందికి సంబంధించి విద్యాశాఖ 2023 జూన్ 22న నిర్ధేశించిన ఉత్తర్వుల ప్రకారం పారదర్శకంగా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నామని కృష్ణాజిల్లా డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. ‘సాక్షి’లో ఎయిడెడ్‌కు సర్దు ‘పోటు’ శీర్షికన ప్రచురించిన కథనంపై ఆయన ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. 44 మంది ఎయిడెడ్ మిగులు ఉపాధ్యాయులను వారి ఆప్షన్ ప్రకారం అవసరమన్న ఎయిడెడ్ పాఠశాలలకు కౌన్సెలింగ్ ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే శారదా విద్యాలయం హైస్కూల్‌ను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మూసివేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో అందులో పని చేసే ఉపాద్యాయులను 2022 మే 20 ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ యజమాన్య పాఠశాలల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం విద్యాశాఖ క్యాడర్ స్ట్రెంత్‌ను పంపామని, తదుపరి వచ్చే ఆదేశానుసారం ఆ సిబ్బంది సర్దుబాటు చేస్తామని డీఈవో సుబ్బారావు తెలిపారు. అలాగే పాతబస్తీలో జరిగిన కొత్త పోస్టుల భర్తీ నిబంధనల ప్రకారం ఆనాటి డీఈవో ఆదేశాలు ఇచ్చారని, ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను బట్టి నలుగురు ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


