మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. గుణదలలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) కార్యాలయంలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమం బుధవారం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరై 25 మందికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన వారి ఉద్యోగుల కుటుంబాల్లోని 25 మందికి నియామక పత్రాలను అందించామన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు మెరుగైన శిక్షణ అందించేందుకు విశాఖ పట్నంలో రూ. 30కోట్లతో ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్‌ను నిర్మించామన్నారు. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ, భక్తుల సౌకర్యార్థం తిరుపతి – విజయవాడ – తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి–విజయవాడ(07606) స్పెషల్ ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున 1.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి ఉదయం 8 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ – తిరుపతి(07605) స్పెషల్ అదే రోజు ఉదయం 9గంటలకు విజయవాడలో బయల్దేరి సాయంత్రం 4.45 గంటలకు తిరుపతి వెళ్తుంది.


