ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల వేళ దేవస్థాన అధికారులు ట్రస్ట్ బోర్డు ముందు ఉంచిన 25 అంశాలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం బుధవారం మహా మండపం నాల్గో అంతస్తులోని సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన ఈవో శీనానాయక్ సమక్షంలో ట్రస్ట్ బోర్డు సమావేశానికి బోర్డు సభ్యులందరూ హాజరయ్యారు. సమావేశం అనంతరం చైర్మన్ రాధాకృష్ణ బోర్డు నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో మొత్తం 25 అంశాలు చర్చకు రాగా, దాదాపు అన్ని అంశాలు దసరా ఉత్సవాలకు సంబంధించి కావడంతో వాటిని ఆమోదించామన్నారు. ఉత్సవాలలో ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఒక పనిని పర్యవేక్షించేలా డ్యూటీలు వేసుకోవాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు డీఈవో కిషోర్‌కుమార్, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఆమోదం తెలిపిన ప్రతిపాదనల్లో కొన్ని..
● దసరా ఉత్సవాలలో భక్తుల రద్దీ సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ ఆధారిత భక్తుల పర్యవేక్షణ, ముఖ గుర్తింపు, దర్శనానికి పట్టే సమయం అంచనా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఈ– ప్రోక్యూర్‌మెంట్ ద్వారా అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 13.39లక్షలకు అప్పగించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
● భక్తులకు లడ్డూలను పంపిణీ చేసేందుకు అవసరమైన ఏటీఎం మిషన్‌ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఒక్కో లడ్డూ ఏటీఎం మిషన్ ధర రూ. 6.95లక్షలు కాగా, ఇటీవల సీపీ కార్యాలయంలో నిర్వహించిన ట్రయల్ రన్‌పై అధికారులు సంతృప్తిని చెందగా, ఆ మిషన్లను ఉత్సవాలలో ఏర్పాటుకు బోర్డు ఆమోదించింది.
● తాత్కాలిక క్యూలైన్లు, ఎంఎస్ ఆర్చ్ ఫ్రేమ్‌లు, తాత్కాలిక సీసీ కెమెరాలు, వాటర్ ప్రూఫ్ షెడ్డు, వంటి పనులకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది.
● పాత లడ్డూ పోటులో వంటగదికి సంబంధించి పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, భవన నిర్వహణ పనులు చేపట్టనున్నారు.
● మల్లేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ ప్రాకార మండపంలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌లతో రక్షణ, యాగశాల చుట్టూ వర్షం నుంచి రక్షణ కలిగించేలా పనులు చేపట్టేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపింది.
● ఉత్సవాలలో అమ్మవారి అన్నప్రసాదం, ప్రసాదాల తయారీకి అవసరమైన సరుకులను అక్టోబర్ 1వ తేదీ నుంచి సరఫరా చేసేందుకు ఆరు నెలల పాటు టెండర్‌ను బోర్డు ఆమోదించింది.
దసరా ఉత్సవాల నేపథ్యంలో
ట్రస్ట్ బోర్డు నిర్ణయం


