విద్యుత్‌ తీగెలు తగిలి గ్రావెల్‌ లారీ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగెలు తగిలి గ్రావెల్‌ లారీ దగ్ధం

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

నేడు ఇండస్ట్రియల్‌ బిజినెస్‌ మీట్‌

విజయవాడరూరల్‌: మండలంలోని కొత్తూరు తాడేపల్లి పరిధిలో ఉన్న అస్సైన్డ్‌ భూముల నుంచి గ్రావెల్‌ రవాణా చేసే లారీ విద్యుత్‌ తీగెలు తగిలి బుధవారం దగ్ధమైంది. కొత్తూరు క్వారీ నుంచి తాడేపల్లి మెయిన్‌ రోడ్డులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మార్‌ బాక్స్‌ వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగెలు లారీకి తగిలాయి. విద్యుత్‌ షార్క్‌ సర్క్యూటై మంటలు ఎగసిపడ్డాయి. డీజిల్‌ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో లారీ దగ్ధమైంది. దాదాపు గంట సమయం మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి అధికారి ఎండీ సలావుల్లా సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్‌ పరారయ్యాడని స్థానికులు తెలిపారు. లారీలో దాదాపు 40 టన్నుల గ్రావెల్‌ లోడు ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన లారీ టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరుడిదని, అతనికి సంబంధించిన లారీలే అస్సైన్డ్‌ భూముల్లో గ్రావెల్‌ను రవాణా చేస్తున్నాయని వివరించారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పారిశ్రామిక, వ్యాపార రంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్‌ బిజినెస్‌ మీట్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డి.కె.బాలాజీ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇటీవల కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వన్‌ ఫ్యామిలీ – వన్‌ ఎంటర్‌పెన్యూర్‌ వర్క్‌షాపునకు లభించిన విశేష స్పందనకు కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా వ్యాపారం లేక పరిశ్రమలను ప్రారంభించాలనుకునే ఔత్సాహి కులు, ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలు తమకు ఎదురవుతున్న సమస్యలు, అవసరాలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని సూచించారు. వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, వివిధ శాఖల నుంచి అందాల్సిన సహకారం, ఇతర సమస్యలపై సంబంధిత అధికారులతో నేరుగా చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఈ సమావేశంలో అందుబాటులో ఉంటారని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని జిల్లాలో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారం, అనుమతులు తదితర అంశాలపై అధికారులతో చర్చించవచ్చని సూచించారు. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం కోసం 99890 92288 సెల్‌ నంబరులో సంప్రదించాలని కోరారు.

ఎగుమతి వ్యాపారంలో మోసంపై ఫిర్యాదు

పటమట (విజయవాడ తూర్పు): ఎగుమతి వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి తనతో సరుకులు ఎగుమతి చేయించి, బిల్లుల చెల్లింపులు నిలిపివేశారని ఆరోపిస్తూ పటమటకు చెందిన ఓ వ్యాపారి బుధవారం సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. పటమట ఎంప్లాయీస్‌ కాలనీకి చెందిన నూర్‌బాషా రమేష్‌ 2024 ఏప్రిల్‌లో ఏఆర్‌ గ్లోబల్‌ ఎగ్జిమ్‌ ట్రేడర్స్‌ పేరుతో సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌కు చెందిన ముక్కవల్లి వెంకట ప్రకాష్‌, కెనడాకు చెందిన గ్రాండ్‌లైన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు/ప్రతినిధులైన అనిల్‌ లుకోస్‌, సుధిన్‌ కనకరాజ్‌, వెంకట రామన్‌ నీలకంఠన్‌ అలియాస్‌ వెంకట నితిన్‌, బిజన్‌ చౌదరి, పినూ విజయ్‌ కుమార్‌, శ్రీలేఖలతో పరిచయమైంది. వారు రమేష్‌తో కెనడాకు ఎగుమతి వ్యాపారం చేసేలా ప్రేరేపించారు. అధిక లాభాలు వస్తాయని వారు హామీ ఇవ్వడంతో రమేష్‌ తన నగదుతోపాటు రుణాలు తీసుకుని సరుకు ఎగుమతి చేశారు. మూడు కంటైనర్లలో 69 టన్నుల వేరుశనగ, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులను కెనడాకు ఎగుమతి చేశారు. ఈ సరుకు విలువ 86,545.63 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది. ఎగుమతి చేసిన అనంతరం రోజుకు 15 వేల డాలర్ల చొప్పున పోర్ట్‌ డెమరేజ్‌ చార్జీలు విధిస్తారని చెప్పి, వాటిని వెంటనే చెల్లించాలని సూచించారు. ఆ మొత్తాన్ని కూడా సాధారణ బ్యాంకింగ్‌ విధానాన్ని పక్కనపెట్టి ఒరిజినల్‌ బిల్స్‌ ఆఫ్‌ లేడింగ్‌ను గుజరాత్‌లోని తమ ఏజెంట్‌ మూన్‌ సైట్‌ మారిటైమ్‌ ద్వార చెల్లించాలని రమేష్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత టెలెక్స్‌ ప్రకటన ద్వారా ఆ సరుకును కెనడాలోని వాంకోవర్‌ పోర్టు నుంచి తమ గిడ్డంగులకు మళ్లించి, 300 రోజులకు పైగా రమేష్‌కు బిల్లులు చెల్లించలేదు. తనకు బకాయి ఉన్న మొత్తంలో రూ.28 లక్షలకు వెంకట ప్రకాష్‌ ఓ ప్రైవేటు బ్యాంక్‌ ద్వారా చెక్కు ఇచ్చినప్పటికీ, ఆ తరువాత దానిని బ్యాంక్‌లో పాస్‌ కాకుండా నిలిపివేయించారు. తన సరుకుకు సంబంధించి నిందితులు రూ.82 లక్షల బకాయి ఉన్నాయని, తాము ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సరుకు డెలివరీ అనంతరం బిల్లు మొత్తానికి వార్షిక వడ్డీ కలిపి మొత్తం రూ.1.02 కోట్లకు పైగా రావాల్సి ఉందని, తనను మోసం చేసి ఆర్థికంగా నష్టపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రమేష్‌ తన ఫిర్యాదులో కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement