పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు వెలగలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పీహెచ్‌సీల్లో నిర్వ హిస్తున్న రోగనిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. గర్భిణులు, పిల్లల నమోదు, లబ్ధిదారుల స్క్రీనింగ్, వ్యాక్సి నేషన్ తదితర అంశాలను సమీక్షించారు. ఓపీ రిజిస్టర్లు, ఈహెచ్‌ఆర్ రిజిస్ట్రేషన్లు, సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు.
ఎన్‌ఆర్‌ఐకి రూ.20 కోట్ల టోకరా
పటమట(విజయవాడతూర్పు): తమ కంపెనీల్లో పెట్టుబడితో అధిక రాబడి సాధించొచ్చని ఓ ఎన్‌ఆర్‌ఐని మోసం చేసిన ఘటన విజయవాడ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. నగరానికి చెందిన సాయిరాజ్ కొత్తమాను ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్నారు. 2019 నుంచి 2025 మధ్య ఉమా సాయి ప్రసాద్ గుంటుబోలు (టీమ్ ఎస్‌ఎస్టీ ఫర్ యూ, విశాఖ పట్నం), బాపట్ల నాగేశ్వరరావు (బీఎన్‌ఆర్ కన్సల్టెన్సీ, దుబాయ్) వద్ద సాయిరాజ్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. భారతదేశంలో చేసిన పెట్టుబ డులతో పాటు, విదేశీ వైర్ ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా బదిలీ చేసిన నిధులతో కలిపి రూ.20 కోట్ల వారికి ఇచ్చారు. ప్రారంభంలో సాయిరాజ్‌కు సాయి ప్రసాద్, నాగేశ్వరరావు లాభాలు వచ్చాయంటూ నగదు చెల్లించి అతని నమ్మకాన్ని పొందారు. ఆ తర్వాత తిరిగి చెల్లించకుండా అతనితో మాట్లా డటం మానుకున్నారు. సాయిరాజ్ కొత్తమాను పదేపదే తన బాకీ చెల్లించాలని అడగ్గా.. ఇప్పటికే నిధులు జమ చేశామని, బ్యాంకింగ్, నియంత్రణ లేదా ఇతర సంబంధిత సమస్యల కారణంగా బదిలీ పెండింగ్‌లో ఉందంటూ కల్పిత బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆన్‌లైన్ స్క్రీన్‌షాట్‌లు, తప్పుడు పెట్టుబడి నివేదికలను ఇస్తున్నారు. దీంతో తాను మోసపోయానని సాయిరాజ్ కొత్తమాను భావించాడు. ఈ మోసంపై సాయిరాజ్ కొత్తమాను స్నేహితుడు నెల్లూరి వంశీకృష్ణ సైబర్ పోలీసు లకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వీఓఏ అరెస్ట్
పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరులో డ్వాక్రా మహిళల సొమ్ము కాజేసిన వీఓఏ సునీతారాణిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ తాతాచారి కథనం మేరకు.. పెనమలూరు గ్రామ సమైక్య–5 వీఓఏ సునీతారాణికి ఆమె పరిధిలోని డ్వాక్రా మహిళలు బ్యాంకు నుంచి తీసుక్ను రుణాలు, సీ్త్రనిధి రుణాలు తిరిగి చెల్లించారు. అయితే సునీతారాణి ఆ సొమ్ము జమ చేయకుండా ఏకంగా రూ.43,67,256 స్వాహా చేసింది. డ్వాక్రా మహిళల ఫిర్యాదు మేరకు అధికారులు రికార్డులు పరిశీలించారు. ఈ అక్రమాలపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు సునీతారాణిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.


